గుత్తా, దానం, పసునూరి, మల్లారెడ్డి... ఇంతమంది జంపా.... అయ్యో!

March 16, 2024


img

లోక్‌సభ ఎన్నికలకు ముందే అనేకమంది ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌, బీజేపీలలో చేరిపోతుండటం చూస్తే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్నట్లే ఉంది. బీజేపీ ప్రకటించిన 15 మంది ఎంపీ అభ్యర్ధులలో ఏడుగురు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి చేరినవారే. 

తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలను ఆకర్షించి ఎత్తుకుపోతోంది. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే, మరో సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఖైరతాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారు. 

వారికంటే ముందుగానే వరంగల్‌ బిఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసి పార్టీలో సీటు, వీలైతే టికెట్‌ ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ఓ పక్క కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తుంటే, ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోవడంతో పార్టీ పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. 

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టి జోరుగా ఎన్నికల ప్రచారం చేయాల్సిన ఈ సమయంలో కల్వకుంట్ల కవిత కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సివస్తోంది. దీంతో లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కనీసం 7-8 సీట్లు గెలుచుకోలేకపోతే ఇంకా వేగంగా ఖాళీ అయిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విపత్కర పరిస్థితులను కేసీఆర్‌ ఏవిదంగా అధిగమించి లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకుంటారో? పార్టీని ఏవిదంగా కాపాడుకుంటారో?


Related Post