కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐ‌టి, ఈడీ సోదాలు

March 15, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఐ‌టి, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు శాఖలకు చెందిన 12 మంది అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని కల్వకుంట్ల కవిత నివాసంలో సోదాలు చేస్తున్నారు.

 ఆమె రెండు ఫోన్లతో పాటు ఆమె నివాసంలో పనిచేస్తున్న వారందరి ఫోన్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లంతా సోదాలు చేసి కొన్ని కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆమెను ఈడీ విచారణకు పిలిస్తే హాజరు కావడం లేదు కనుక అధికారులు ఆమెను ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. 

ఈ విషయం తెలిస్తే బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది కనుక భారీగా కేంద్ర బలగాలను మోహరించి, ఆమె ఇంటివైపు వెళ్ళే అన్ని మార్గాలను మూసివేశారు. 

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు మళ్ళీ ఈ కేసులో కల్వకుంట్ల కవిత ఇంట్లో హటాత్తుగా సోదాలు నిర్వహించడం ఈ కేసు విచారణ కొరకే అనుకోలేని పరిస్థితి.

బహుశః బిఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు కావచ్చు లేదా బిఆర్ఎస్, బీజేపీల మద్య లోపాయికారి ఒప్పందం జరిగిన్నట్లయితే లోక్‌సభ ఎన్నికలలో సెంటిమెంట్ రగిలించి బిఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఓట్లు పడేలా చేసేందుకు కావచ్చు. కనుక ఈ సోదాలు రాజకీయ కారణంతో జరుగుతున్నవిగానే భావించవచ్చు. 


Related Post