శనివారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన: ఈసీ

March 15, 2024


img

దేశ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమీషన్‌ తెలిపింది. జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించబోతోందా లేదా అనే విషయం రేపే తెలుస్తుంది. 

లోక్‌సభ: ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 16వ తేదీతో ముగుస్తుంది. కనుక ఆలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి కొత్త సభ ఏర్పాటు అయ్యేలా చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమీషన్‌ మీదే ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించి, 2019 మే 23న ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి వెంట వెంటనే ఫలితాలు ప్రకటించింది. 

ఈసారి మార్చి 16న అంటే వారం రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ప్రకటిస్తున్నందున, ఎన్నికల ప్రక్రియలో సర్దుబాట్లు చేసి ఇంచు మించు అదే సమయానికి ఫలితాలు వెలువడేలా చేయవచ్చు. 

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. మళ్ళీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుంది. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చేతులు కట్టేసిన్నట్లే అవుతుంది. 

ఈ రెండు నెలలు కొత్తగా ఎటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు ప్రారంభించలేవు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ప్రారంభించిన పధకాలకు తప్ప కొత్తవాటిని ప్రారంభించలేదు. ముఖ్యంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియపై ఈ ప్రభావం పడితే పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంటుంది.


Related Post