కేసీఆర్ ఓవైసీకి తోడ్పడుతున్నారా... తెగతెంపులు చేసుకున్నారా?

March 15, 2024


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తొలిసారిగా ఓ విచిత్రం జరుగుతోంది. మజ్లీస్‌, బిఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నందున లోక్‌సభ ఎన్నికలలో హైదరాబాద్‌ ఎంపీ సీటుని మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కోసం కేసీఆర్‌ విడిచిపెట్టేవారు. కానీ మజ్లీస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడుతుందని అసదుద్దీన్‌  ఓవైసీ ఇటీవల బహిరంగంగా చెప్పడంతో, బిఆర్ఎస్ పార్టీకి దూరమైన్నట్లే భావించవచ్చు. 

కనుక ఈసారి హైదరాబాద్‌ ఎంపీ సీటుని తమ కొత్త స్నేహితుడు బీఎస్పీకి అప్పగించేశారు. కనుక ప్రస్తుతానికి మజ్లీస్‌ పార్టీతో తాము కూడా తెగతెంపులు చేసుకున్నట్లే అని కేసీఆర్‌ చెప్పకనే చెప్పేశారు. అక్కడ నుంచి పోటీ చేయబోయే అభ్యర్ధిని త్వరలోనే ప్రకటిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ చెప్పారు. 

అయితే బీఎస్పీ ఎవరిని నిలబెట్టినా అసదుద్దీన్‌  ఓవైసీని ఢీకొని నిలబడటమే కష్టం. ఈ విషయం కేసీఆర్‌కి ఇంకా బాగా తెలుసు. బహుశః అందుకే ఆ సీటుని బీఎస్పీకి ఇచ్చేసి ఉండవచ్చు. తద్వారా మజ్లీస్ పార్టీతో బంధం చెడిపోకుండా కాపాడుకుంటూ, ఓవైసీ గెలుపుకి పరోక్షంగా తోడ్పడుతున్నట్లు అవుతుంది కూడా. 

మజ్లీస్‌తో దోస్తీ కుదిరింది కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి పోటీ చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టి అసదుద్దీన్‌  ఓవైసీ గెలుపుకి తోడ్పడవచ్చు. 

ఈసారి హైదరాబాద్‌ సీటుపై కన్నేసిన బీజేపీ హిందూమత ప్రచారకురాలు మాధవీలతని తమ అభ్యర్ధిగా బరిలో దింపుతోంది. కనుక పోటీ ప్రధానంగా బీజేపీ, మజ్లీస్ పార్టీల మద్యనే ఉండ బోతోందని స్పష్టం అవుతోంది. 

ఈ నేపధ్యంలో చూసిన్నట్లయితే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ, బిఆర్ఎస్, మజ్లీస్‌ నాలుగు పార్టీలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో బీఎస్పీ బకరాగా మారిందని అర్దమవుతోంది. 


Related Post