కాంగ్రెస్‌, బీజేపీలకు బలం, అభ్యర్ధులు లేరు అందుకే...

March 14, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌, బీజేపీలో చేరిపోతుండటంపై ఆయన స్పందిస్తూ, “కాంగ్రెస్‌, బీజేపీలకు క్షేత్రస్థాయిలో బలం, బలమైన అభ్యర్ధులు లేరు. అందుకే లోక్‌సభ ఎన్నికల కోసం మన పార్టీ నుంచి నేతలను ఎత్తుకుపోయి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేయిస్తోంది. 

బీజేపీలో బలమైన అభ్యర్ధులు లేరని దీంతో స్పష్టమవుతోంది. దూరపు కొండలని చూసి పార్టీని వీడి కాంగ్రెస్‌, బీజేపీలలో చేరుతున్నవారికి ఆ పార్టీలలో గౌరవం, సముచిత స్థానం లభించే అవకాశం ఉండదు. రెండు పార్టీలు మన పార్టీ నేతలని ఆకర్షించి కండువాలు కప్పి తమ బలం పెరిగిందని సంబురపడుతున్నాయి. అందుకే మన పార్టీ నేత ఆరూరి రమేష్ వంటివారిని సైతం బీజేపీలో చేర్చుకునేందుకు సిద్దపడుతోంది. 

కానీ భవిష్యత్‌లో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతోంది. అప్పుడు బిఆర్ఎస్ బీఫారం లభిస్తే చాలని చాలామంది క్యూ కడతారు,” అని అన్నారు. 

ఒకే ఒక ఓటమితో బిఆర్ఎస్ పార్టీకి ఇంత దుస్థితి వస్తుందని బహుశః కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు వంటివారు కూడా ఊహించి ఉండరు. 

దూరపు కొండలని చూసి పార్టీని వీడుతున్నారని కేసీఆర్‌ సమర్ధించుకున్నప్పటికీ, నిజానికి కేసీఆర్‌ కూడా ఆ దూరపు కొండ (బీజేపీ)నే ఆశగా చూస్తున్నారని అందరికీ తెలుసు. తమతో బీజేపీ కలిసి వస్తే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి వద్దామనే ఆలోచన ఉన్నట్లు కేటీఆర్‌ స్వయంగా బయటపెట్టుకున్నారు కదా?

ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్న బీజేపీలో చేరుతున్న బిఆర్ఎస్ నేతల భవిష్యత్‌కు ఎటువంటి ఢోకా ఉండదు. కానీ ఈ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కనీసం 9 ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోతే, ఎన్నికల తర్వాత పార్టీ ఇంకా వేగంగా ఖాళీ అయిపోయే ప్రమాదం పొంచి ఉంది. 

ఈ విషయం కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్‌ నేతలందరికీ కూడా తెలుసు. కనుక లోక్‌సభ ఎన్నికలలో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్‌, బీజేపీలకు బలం, అభ్యర్ధులు లేరు. భవిష్యత్‌లో మనమే అధికారంలోకి వస్తామని ఇంకా ఆత్మవంచన చేసుకుంటే నష్టపోయేది బిఆర్ఎస్‌ పార్టీయే.


Related Post