లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌కు సొంత మనుషులతోనే పోటీ

March 14, 2024


img

శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి తీవ్ర ఇబ్బందులు, అసహనంతో ఉన్న బిఆర్ఎస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. మరింత అసహనం కలుగజేస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్‌ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు కాంగ్రెస్‌, బీజేపీలలో చేరిపోతుండటం ఓ సమస్య కాగా, బీజేపీ వారినే ఎంపీ అభ్యర్ధులుగా బరిలో దించుతుండటం బిఆర్ఎస్‌ పార్టీకి ఇంకా ఇబ్బందికరంగా మారింది. 

ఇప్పటి వరకు బీజేపీ 15 మంది అభ్యర్ధులను ప్రకటించగా వారిలో ఏడుగురు బిఆర్ఎస్‌ పార్టీ నుంచి వచ్చి చేరినవారే. కనుక లోక్‌సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ బలమైన ఎంపీ అభ్యర్ధులను కోల్పోవడమే కాకుండా తిరిగి వారితోనే పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. 

పైగా ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు కల్వకుంట్ల కవిత వంటి సీనియర్లు కూడా వెనకడుగు వేస్తుండటం, శాసనసభ ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన బీఎస్పీతో కేసీఆర్‌ పొత్తుకు సిద్దపడటం వంటివి ఎన్నికలకు ముందే బిఆర్ఎస్‌ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లవుతోంది. 

ఇటువంటి సంకేతాల వలన బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలనుకునేవారు కూడా ఈసారి కాంగ్రెస్‌ లేదా బీజేపీ అభ్యర్ధులకు ఓట్లు వేసే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ఇదే జరిగితే లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం, ఆ కారణంగా ఇంకా వేగంగా వలసలు మొదలైపోవచ్చు. 


Related Post