రండి అందరం బీజేపీలో చేరిపోదాం: శానంపూడి

March 13, 2024


img

ఒకే ఒక్క ఓటమితో ఏ పార్టీ కూడా పూర్తిగా దెబ్బతినేయదు. మళ్ళీ కోలుకొని నిలబడుతుంది. అదృష్టం బాగుంటే మళ్ళీ అధికారంలోకి వస్తుంది కూడా. దాదాపు రెండున్నర దశబ్ధాలుగా తెలంగాణ రాజకీయాలను ఎదురే లేకుండా శాశించిన బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకే ఒక్క ఓటమితో చెల్లా చేదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు ఉదయం హన్మకొండలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించేందుకు సిద్దమవుతుండగా, ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరూ వచ్చి ఆయనను కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు.

అక్కడ ఇంకా కలకలం కొనసాగుతుండగానే, ఇటీవల బీజేపీలో చేరిన హుజూర్ నగర్‌ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన అనుచరులతో ఫోన్లో మాట్లాడిన మాటలు మీడియాకు లీక్ అవడంతో బిఆర్ఎస్ పార్టీలో ఇంకా కలకలం చెలరేగింది. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే నేను పార్టీలో చేరక ముందు నియోజకవర్గంలో కనీసం ఒక్క సర్పంచ్‌ కూడా లేరు. నేను చేరిన తర్వాత 120 సర్పంచ్‌, పీఏసీఎస్, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు గెలుచుకొని పార్టీని బలోపేతం చేసుకున్నాము. కానీ మన పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్న యువతకు ఏమీ చేయలేకపోయామనే బాధ ఉండేది.

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మన పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఈ పరిస్థితులలో నాకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. నాకు ఎంపీ టికెట్‌ కూడా ఇస్తానన్నారు. కానీ నాతో పాటు మీరందరూ కూడా బీజేపీలో చేరితే ఏమైనా చేయగలుగుతాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీనపడుతుంది. 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరిపోయి రేవంత్‌ రెడ్డికి మద్దతు ఇస్తారు. అప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీనం అవుతుంది. బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉంది. ఈ పరిస్థితులలో దానిలో ఉండి నష్టపోవడం కంటే మీరు కూడా బీజేపీలో చేరిపోతే అందరికీ మంచిది,” అని అన్నారు.


Related Post