ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్!

March 13, 2024


img

నేడో రేపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ జారీ కాబోతోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఏటా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

“1947లో భారత్‌ స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా 13 నెలల పాటు హైదరాబాద్‌ నిజాం నవాబుల పాలనలో ఉంది. అప్పుడు 1948, సెప్టెంబర్‌ 17న ‘ఆపరేషన్ పోలో’ చేపట్టిన పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్‌ భారత్‌లో విలీనం అయ్యింది. కనుక సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 

ప్రజల అభీష్టం మేరకు హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమర వీరులను స్మరించుకుని యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది,” అని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రాకులాడుతున్నాయని, అందుకోసమే మజ్లీస్‌ పార్టీ అభీష్టానికి విరుద్దంగా హైదరాబాద్‌ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడానికి వెనకాడుతున్నాయని రాష్ట్ర బీజేపీ నేతలు మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరకు బీజేపీ నేతలందరూ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెపుతుండటం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే ఈ ఉత్తర్వులు జారీ చేసి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించక తప్పనిసరి చేసింది. 

దీనిపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్, మజ్లీస్‌ పార్టీలు తీవ్రంగా స్పందించడం ఖాయమే. దీంతో సెంటిమెంట్ రగిలితే బీజేపీకి లబ్ధి కలిగే అవకాశం ఉంటుందని వేరే చెప్పక్కర లేదు. కనుక లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసిన్నట్లు భావించవచ్చు.


Related Post