మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్

March 12, 2024


img

పంజగుట్ట పోలీసులు తెలంగాణ ఇంటలిజన్స్ బ్యూరో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు అనధికారికంగా ట్యాపింగ్ చేశారని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై సెక్షన్స్ 409,427,201, ఐ‌టి యాక్ట్స్ సెక్షన్స్ 65,66,70 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు. 

ఆయన ఫోన్స్, ల్యాప్ టాప్ తదితర పరికరాలన్నిటినీ స్వాధీనం చేసుకొని, వాటిలో భద్రపరిచిన డేటాతో పాటు డిలీట్ చేసిన డేటాని కూడా రికవర్ చేసి, ఆయన ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేసేవారు? ఎందుకు చేసేవారు? అనే వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ వ్యవహారం రాజకీయాలతో ముడిపడి ఉండటమే కాకుండా ఇంకా చాలా అంశాలను లోతుగా పరిశీలించి నిర్ధారించుకోవలసి ఉంటుంది కనుక ఈ కేసు తదుపరి విచారణ కొరకు ప్రత్యేక బృందం (సిట్)ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది లేకుంటే తెలంగాణ సిఐడీ పోలీసులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో ప్రభుత్వం మారబోతోందని పసిగట్టగానే ప్రణీత్ రావు, తన వద్ద ఉన్న డేటాతో పాటు స్పెషల్ ఇంటలిజన్స్ విభాగంలోని లాకర్ రూములో భద్రపరిచిన 42 హార్డ్ డిస్కులని, సుమారు 1,610 పేజీల కాల్ డేటాని సాక్ష్యాధారాలు దొరక్కుండా తగులపెట్టి నాశనం చేసిన్నట్లు విచారణలో కనుగొన్నారు. 

ప్రణీత్ రావుకి నాటి ప్రభుత్వ పెద్దల ప్రోత్సహంతోనే ఈవిదంగా చేసి ఉండవచ్చని, అందుకే ఆయనకు చాలా త్వరగా ప్రమోషన్స్ పొంది డీఎస్పీ స్థాయికి ఎదిగారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత డీఎస్పీ గంగాధర్ కూడా ఈ ప్రమోషన్స్ గురించి ఫిర్యాదు చేశారు. 

ఒకవేళ గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పెద్దల ప్రోత్సాహంతోనే ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన్నట్లు కనుగొన్నట్లయితే, ఇప్పటికే పలు అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ తదితరులు ఇంకా కష్టాలలోకి కూరుకుపోయే అవకాశం ఉంది.


Related Post