ఖాళీ అయిపోతున్న బిఆర్ఎస్ పార్టీ.. ఇవాళ్ళ మరో నలుగురు జంప్!

March 10, 2024


img

శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ, త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో తన సత్తా చాటుకొని రాష్ట్ర రాజకీయాలపై మళ్ళీ పట్టు సాధించాలని ప్రయత్నిస్తుంటే, ఆ పార్టీలో పలువురు సీనియర్ నేతలు రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోతుండటం కేసీఆర్‌కు చాలా ఆందోళన కలిగించే విషయమే. 

బీజేపీ మాజీ ఎంపీలు సీతారాం నాయక్ (మహబూబాబాద్), గోడం నగేష్ (ఆదిలాబాద్‌), మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి (హుజూరు నగర్‌), జలగం వెంకట్రావు (కొత్తగూడెం) ఆదివారం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేతలు తరుణ్ చుగ్, కె.లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరిపోయారు. మోడీ నాయకత్వంలో దేశం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటామని, పార్టీ తమకు ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తామని చెప్పారు. 

ఇప్పటికే బీజేపీలో ముగ్గురు బిఆర్ఎస్ ఎంపీలు చేరారు. వారికి బీజేపీ తొలి జాబితాలో టికెట్లు కూడా ఖరారు చేసింది. బూర నర్సయ్య గౌడ్ భువనగిరి, బీబీ పాటిల్ జహీరాబాద్, ఎంపీ రాములుకి బదులు ఆయన   కుమారుడు పి.భరత్ నాగర్‌కర్నూల్‌ నుంచి ఈసారి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేయబోతున్నారు. 

ఈరోజు బీజేపీలో చేరినవారిలో కనీసం ముగ్గురిని బీజేపీ అభ్యర్ధులుగా బరిలో దించబోతున్నట్లు సమాచారం. అంటే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తమ పార్టీని వీడిన నేతలతోనే యుద్ధం చేయాలన్న మాట!        



Related Post