బీజేపీ కొత్త పొత్తులు దేనికి? జవాబు రేవంత్‌ రెడ్డికే తెలుసుగా

March 10, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బీజేపీ కొత్త పొత్తులపై స్పందిస్తూ, “ఈసారి లోక్‌సభ ఎన్నికలలో 400 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, ఏపీలో టిడిపి, కర్ణాటకలో జేడిఎస్‌, బిహార్‌లో జేడీయు, ఒడిశాలో బిజెడీ... ఇలా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?

బీజేపీకి లొంగనివారిపై అక్రమకేసులు బనాయించి మరీ లొంగదీసుకొంటున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందనే భయంతోనే బీజేపీ పొత్తుల కోసం అర్రులు చాస్తోంది,” అని ఎద్దేవా చేశారు. 

ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌ రెడ్డికి బీజేపీ ఎందుకు పొత్తులు పెట్టుకుంటోందో తెలియదనుకోలేము. ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ పేరుతో కూటమి ఏర్పాటు చేసుకుంది. 

ఇప్పుడు కాంగ్రెస్‌ బలహీనపడటంతో ప్రాంతీయ పార్టీలతో కలిసి ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి ఏర్పాటు చేసుకుంది. అయినా కూడా కాంగ్రెస్‌ ఒంటరిగా లేదా ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం సిఎం రేవంత్‌ రెడ్డికి తెలియదనుకోలేము. 

కనుక బీజేపీ ఎలాగూ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నప్పటికీ కొత్త పొత్తులు ఎందుకు?అని అడిగితే బాగుండేది. కానీ బీజేపీ గెలుస్తుందని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నోటితో చెప్పలేరు కనుక 400 సీట్ల గురించి ప్రస్తావిస్తూ పొత్తులు ఎందుకని ప్రశ్నిస్తున్నట్లు భావించవచ్చు.

బీజేపీ 400 సీట్లు సాధించేందుకు కొత్తగా పొత్తులు పెట్టుకుంటోందనే విషయం అందరికీ తెలుసు. ఈసారి అంత మెజార్టీ సాధిస్తే దేశంలో కాంగ్రెస్‌ మరింత కుచించుకుపోతుంది కూడా. కనుక కాంగ్రెస్‌ నేతలు బీజేపీని ప్రశ్నించడం మానుకొని తమ పార్టీకి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తే మంచిదేమో?


Related Post