రేవంత్‌ ఎన్నికలకు ముందు అగ్గి రాజేస్తున్నారా?

March 10, 2024


img

సాధారణంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు మరి కాస్త వాడివేడిగా పరస్పరం విమర్శించుకుంటాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున తెలంగాణలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాయి. 

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మొన్న ‘మీ ప్రభుత్వాన్ని మీ చుట్టూ ఉన్నవాళ్ళే కూల్చేస్తారంటూ’ అగ్గి రాజేయగా, సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.

“మా ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. మేమేమీ మీలాగా అయ్య పేరు చెప్పుకొని అడుక్కొని అధికారంలోకి రాలేదు. ప్రజలు గెలిపిస్తే అధికారంలోకి వచ్చాము. నా ప్రభుత్వం జోలికి వస్తే మీ ఫామ్‌హౌస్‌ కాదు కదా... దాని ఇటుకలు కూడా మిగలకుండా చేస్తారు మా పార్టీ కార్యకర్తలు. నగరాభివృద్ధికి అడ్డుపడితే ఎంతటివారికైనా నగర బహిష్కరణ తప్పదు. 

మీ బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు ప్రతిపక్షాలను శాసనసభలో మాట్లాడటానికి అవకాశం ఈయలేదు. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము గాబట్టే శాసనసభలో బయటా ఇంతలా మాట్లాడగలుగుతున్నారు. 

ఆనాడు కేసీఆర్‌ ధర్నా చౌక్ ఎత్తేస్తే, ఇప్పుడు ఆయన కూతురే అక్కడ కూర్చొని ధర్నా చేస్తోంది. మీ తండ్రి కేసీఆర్‌ మహిళలకు ఎన్ని ఉద్యోగాలు, పదవులు ఇచ్చారో ముందు చెప్పి ఆ తర్వాత ధర్నా చేసి ఉంటే బాగుటుంది. మీరు మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అడుగుతున్నారు. కానీ మా ప్రభుత్వం 43 శాతం ఇస్తోంది. అక్కడ కూర్చొని ధర్నాలు చేయడం కాదు. ఓసారి తండ్రీ కూతుర్లు శాసనసభ సమావేశాలకు వస్తే అన్ని లెక్కలు చెపుతాము. 

లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి నాలుగేళ్ళకే కూలిపోతుంటే అందుకు బిఆర్ఎస్ నేతలు ఏమాత్రం సిగ్గు పడకుండా, బ్యారేజి వద్దకు వెళ్ళి డ్రామాలు ఆడారు. తిరిగి మరమత్తులు చేయించడం లేదని మమ్మల్నే నిందిస్తున్నారు. మీరు అడిగినా అడగకపోయినా నిపుణుల కమిటీ సూచనల ప్రకారం మేడిగడ్డ బ్యారేజికి తప్పకుండా మరమత్తులు చేయిస్తాం. 

మీ తప్పులను, అవినీతిని కప్పు పుచ్చుకునేందుకు మా ప్రభుత్వంపై బురద జల్లుతామంటే చూస్తూ ఊరుకోబోము,” అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని తీవ్రంగా హెచ్చరించారు.


Related Post