ఏపీలో కలిసి పోటీ చేయబోతున్న టిడిపి,జనసేన, బీజేపీ

March 09, 2024


img

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టిడిపి, జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు వాటితో బీజేపీ కూడా కలవబోతోంది. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిన్న అర్దరాత్రి వరకు సుదీర్గంగా పొత్తు, సీట్ల సర్దుబాట్లపై చర్చించారు. 

మళ్ళీ శనివారం ఉదయం ముగ్గురూ సుమారు 50 నిమిషాల పాటు చర్చించిన తర్వాత పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై ఓ అంగీకారానికి వచ్చారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఏపీలో 5 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు, జనసేనకు 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. టిడిపి 17 ఎంపీ, 145 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేయబోతోంది.

టిడిపి, జనసేనలు ఇదివరకే పొత్తులు, సీట్ల సర్దుబాట్లు ఖరారు చేసుకొని రెండు పార్టీలు కలిసి ఉమ్మడి బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ నెల 17న చిలకలూరిపేటలో మరో సభ నిర్వహించి ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించనున్నాయి. వాటితో పొత్తులు ఖరారు అయినందున బీజేపీ కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ సభలోనే మూడు పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీలో అధికార వైసీపితో కలిసేందుకు ఏ పార్టీ సిద్దపడకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తోంది. తాజా పరిణామాల నేపధ్యంలో ఈసారి వైసీపికి ఎన్నికలలో ఎదురీత తప్పకపోవచ్చు. 


Related Post