అయితే రేవంత్‌ ప్రభుత్వానికి మజ్లీస్‌ అండగా ఉండబోతోందా?

March 09, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం పాతబస్తీలో మెట్రో-2 కారిడార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు పాతబస్తీ ప్రజలు, మజ్లీస్‌ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌  ఓవైసీ సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ఖచ్చితంగా 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిలో మీ ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా సహకరిస్తాము. రాష్ట్రంలో, హైదరాబాద్‌ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న బీజేపీని అందరం కలిసి బలంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.

మీరు ముఖ్యమంత్రి కాగానే పాతబస్తీలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం చాలా సంతోషం కలిగిస్తోంది. యాకుత్‌పురాలో రోడ్ల విస్తరణకు అడిగిన వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేయడం, ఇప్పుడు మెట్రో కారిడార్-2 శంకుస్థాపన చేస్తున్నందుకు పాతబస్తీ ప్రజల తరపున కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. మీ పోరాట పటిమ చాలా స్పూర్తిదాయకం,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని లేదా కూలిపోతుందని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు బెదిరిస్తున్నవేళ, ఏడుగురు ఎమ్మెల్యేలు కలిగిన మజ్లీస్‌ అండగా నిలబడేందుకు సిద్దంగా ఉందని అసదుద్దీన్‌  ఓవైసీ చెపుతున్నట్లే భావించవచ్చు. బీజేపీని ఎదుర్కోవడానికి ‘కలిసి పోరాటం చేద్దాం’ అంటే అర్దం అదే. కనుక బిఆర్ఎస్ పార్టీకి తలాక్ చెప్పేందుకు అసదుద్దీన్‌  ఓవైసీ సిద్దమవుతున్నట్లే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించవచ్చు. 


Related Post