కాలేజీ కూల్చివేత కారణం ఆక్రమాణా... తొడకొట్టి సవాలు విసరడమా?

March 08, 2024


img

బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన దిండిగల్ చిన్నదామర చెరువులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను గురువారం రెవెన్యూ సిబ్బంది పాక్షికంగా కూల్చివేయడాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు. 

వేలాదిమంది విద్యార్దులు చదువుకుంటున్న కాలేజీని కూల్చివేయడం ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం ఎటువంటి భూఆక్రమణలకు పాల్పడలేదన్నారు. అయినా మునిసిపల్ అధికారులు నోటీస్ ఇస్తే దానికి యాజమాన్యం వెంటనే వివరణ ఇచ్చినప్పటికీ, భవనాలను కూల్చివేయడం రాజకీయ కక్ష సాధింపే అని అన్నారు. 

దీని గురించి మాట్లాడేందుకు తాము జిల్లా కలెక్టర్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను కలిసేందుకు వెళితే అందుబాటులో లేరన్నారు. భవనాల కూల్చకుండా హైకోర్టు స్టే విధించినప్పటికీ, కూల్చివేసి అధికారులు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని బిఆర్ఎస్‌ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. 

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “నేను, నా మావగారు మల్లారెడ్డిని వెంటపెట్టుకొని ముఖ్యమంత్రిని కలవాలని వెళ్ళిన మాట వాస్తవం. మేము ఇదే సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వెళ్ళాము తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాదు,” అని అన్నారు. 

చిన్నదామర చెరువులో 3.23 ఎకరాలు బఫర్ జోన్, మరో 5.01 ఎకరాలు చెరువుని మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసి దానిలో అక్రమంగా కాలేజీ భవనాలు నిర్మించుకొని, రోడ్లు కూడా వేసుకున్నారని దిండిగల్ మున్సిపల్ అధికారులు చెపుతున్నారు. వాటినిఎందుకు కూల్చివేయరాదో వివరణ కోరుతూ ఫిబ్రవరి 26, మళ్ళీ మార్చి 1న రెండు నోటీసులు ఇచ్చామని చెప్పారు. కానీ కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో హైకోర్టు కమిటీ, జిల్లా కలెక్టర్ అనుమతి, ఆదేశంతో గుర్తించిన భవనాలను పాక్షికంగా కూల్చివేశామని అధికారులు చెపుతున్నారు. 

అయితే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని తొడకొట్టి దమ్ముంటే రారా చూసుకొందాము అంటూ పదేపదే సవాళ్ళు విసిరేవారు. కనుక ఈ కూల్చివేతలకు భూ ఆక్రమణలతో పాటు ఆనాడు మల్లారెడ్డి చేసిన ఈ సవాళ్ళు కూడా ఓ కారణమని భావించవచ్చు.             


Related Post