ఎంపీ సీటు కోసమే దళితుల ఆత్మగౌరవం తాకట్టు: రేవంత్‌ రెడ్డి

March 07, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్‌, బీఎస్పీ పొత్తుల గురించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ నియంతృత్వ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతోందని భావించిన ప్రవీణ్ కుమార్‌ తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి కేసీఆర్‌తో కొట్లాటకు సిద్దపడ్డారు.

కేసీఆర్‌ దొర నిర్మించుకున్న గడీ (ప్రగతి భవన్‌)ని బద్దలు కొడతానని, కేసీఆర్‌ని గద్దె దించి దళితులకు రాజ్యాధికారం కల్పిస్తానని గత మూడేళ్ళుగా చెప్పిన ప్రవీణ్ కుమార్‌, ఇప్పుడు అదే కేసీఆర్‌తో పొత్తుకి సిద్దమయ్యారు. ఎంపీ సీటు కోసం దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టడానికి వెనకాడటం లేదు.

మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ దళితులకు అన్యాయం చేశారు. కేసీఆర్‌తో చేతులు కలిపి ఇప్పుడు ప్రవీణ్ కుమార్‌ కూడా దళితులను మోసం చేస్తున్నారు కదా? కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీనవర్గాల  శ్రేయస్సు కోరుకుంటుంది. మిగిలిన పార్టీలన్నీ వారిని ఓటు బ్యాంకుగానే వాడుకొంటాయి,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

శాసనసభ ఎన్నికలలో బీఎస్పీ ఘోరపరాజయం పాలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎన్నికలలో ఓటమి పాలై ఇంచుమించు అదే పరిస్థితిలో ఉన్న బిఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తే ఎంతో కొత్త లాభం ఉంటుందని ప్రవీణ్ కుమార్‌ భావించి ఉండవచ్చు. 

రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే లోక్‌సభ ఎన్నికలలో కూడా ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. కనుక కలిసి పోటీ చేస్తే ఒకరి మద్దతుతో మరొకరు ఎంతో కొంత లాభపడవచ్చని కేసీఆర్‌, ప్రవీణ్ కుమార్‌ భావిస్తున్నట్లున్నారు. అందుకే పొత్తులకు సిద్దపడ్డారనుకోవచ్చు. కనుక రాజకీయ కోణంలో నుంచి చూస్తే ఇది సరైన ఆలోచనే. 

కానీ కేసీఆర్‌ దళితులకు అన్యాయం చేశారని గట్టిగా వాదించిన ప్రవీణ్ కుమార్‌, ఇప్పుడు ఆయనతో చేతులు కలపడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు? రేవంత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఉందా?


Related Post