రేవంత్ రెడ్డికి ఆ అవకాశం ఇచ్చింది కేసీఆరే!

March 07, 2024


img

మహబూబ్ నగర్‌లో నిన్న జరిగిన ప్రజా దీవెన సభలో సిఎం రేవంత్‌ రెడ్డి మళ్ళీ మరోసారి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. “మీ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉండొచ్చు. కానీ నా ప్రభుత్వం ఆరు నెలలకి మించి అధికారంలో ఉండకూడదా... ఎందుకు? నా ప్రభుత్వాన్ని పడగొడతామని పదేపదే బెదిరిస్తున్నారు. 

అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్‌ ఎంతకైనా దిగజారుతారని అర్దమవుతోంది కదా? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నా ప్రభుత్వాన్ని కూల్చేయాలని కేసీఆర్‌ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను రాష్ట్రంలో మేధావులు, ప్రజలు అందరూ గమనించాలి.

 పాలమూరు రైతుబిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోంటే కేసీఆర్‌ సహించలేకపోతున్నారు. రాష్ట్రానికి మీరు తప్ప మరొకరు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదా?నా ప్రభుత్వం జోలికి వస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టను కబడ్దార్ కేసీఆర్‌,” అంటూ తీవ్రంగా హెచ్చరించారు. 

సిఎం రేవంత్‌ రెడ్డితో సహా ఆయన మంత్రులు కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ, కేసీఆర్‌ని హెచ్చరిస్తుండటానికి చాలా బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం కేవలం ఐదుగురు అదనపు ఎమ్మెల్యేలతో ‘టైట్ రోప్ వాక్’ చేస్తోందని, కనుక కేసీఆర్‌ లేదా మోడీ లేదా ఇద్దరూ కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చివేయగల ప్రమాదం ఉందని కూడా వారికి తెలుసు. 

అందుకే తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు వారిరువురూ కుట్రలు చేస్తున్నారనే విషయం ముందే ప్రజలకు గట్టిగా చెపుతుండటం ద్వారా, ప్రజలకు భయపడి వారు అటువంటి ఆలోచనలు చేయకుండా ఉంటారని కాంగ్రెస్‌ మంత్రుల ఆలోచన కావచ్చు. అయినా ఒకవేళ వారు కూల్చేస్తే కాంగ్రెస్ పార్టీ వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టగలుగుతుంది. 

కేసీఆర్‌ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని ప్రజలకు చెప్పడం ద్వారా, ఆయన ప్రజలు అనుకున్నంత నిజాయితీ గల రాజకీయనాయకుడు కారనే గ్రహించేలా చేసే ప్రయత్నంగా కూడా భావించవచ్చు. అయితే రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులకు తమని వేలెత్తి చూపి ఈవిదంగా హెచ్చరించే అవకాశం ఇచ్చింది కేసీఆరే!     

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తామని లేదా కూలిపోతుందని కేటీఆర్‌, హరీష్ రావులతో చెప్పించడం పెద్ద పొరపాటు. దానినే రేవంత్‌ రెడ్డి, మంత్రులు తెలివిగా తమ ప్రభుత్వానికి కవచంగా మార్చుకొని కేసీఆర్‌ని కట్టడి చేస్తున్నారని చెప్పవచ్చు.                             



Related Post