హైదరాబాద్‌ కోల్పోయి చాలా నష్టపోయాం: జగన్‌

March 05, 2024


img

రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు కావస్తోంది. పదేళ్ళ తర్వాత హైదరాబాద్‌ని కోల్పోవడం వలన ఆంధ్రాకు చాలా నష్టం జరిగిందని నేడు విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి చెప్పుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది. 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ జగన్‌ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ నిలిపి వేయించి, ‘ఏపీకి ఒక్క రాజధాని సరిపోదు మూడు అవసరం’ అంటూ మూడేళ్ళు ఏమీ చేయకుండానే కాలక్షేపం చేసేశారు. నాలుగో ఏడాదిలో మాట మార్చి ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అన్నారు. 

మరి కొద్ది రోజులలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతుంటే “మనం రాజధాని నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నాము కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రాన్ని ఒప్పించి మరో రెండేళ్ళ పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా చేయాలని అడుగుతాము,” అని వైసీపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేత చెప్పించారు. 

దానిని రెండు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు, ప్రజలు తప్పు పట్టడంతో వెనక్కు తగ్గి, ఇప్పుడు జగన్‌ ఏపీకి విశాఖ రాజధానిగా ఉంటుందని చెపుతూ, హైదరాబాద్‌ ప్రస్తావన చేశారు. 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దయనీయ పరిస్థితులలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు అనేక సమస్యలు పరిష్కరించి, అమరావతి, పోలవరం పనులు చేయిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలిగారు. కానీ ఆయన తర్వాత సిఎం అయిన జగన్‌, 5 ఏళ్ళపాటు రాష్ట్రాభివృద్ధికి బదులు వైసీపికి బలమైన ఓటు బ్యాంక్ తయారు చేసుకునేందుకు సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు తెచ్చి పంచిపెడుతూనే ఉన్నారు. 

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే దుస్తితికి చేరుకుంది. ఇది స్వయంకృతాపరాధమే తప్ప హైదరాబాద్‌ కోల్పోవడం కలిగిన నష్టం కాదు కదా?


Related Post