నాడు కేసీఆర్‌ అలాగ... నేడు రేవంత్‌ ఇలాగ!

March 05, 2024


img

కేంద్ర రాష్ట్రాల మద్య సంబంధాలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందుతాయి. అయితే కేంద్రంలో ఓ పార్టీ, రాష్ట్రాలలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీల పరంగా ఉండే విభేదాలు ఈ సంబంధాలపై ప్రభావితం చూపుతుంటాయి. ఆ రాజకీయ ప్రభావాలకి అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడం కత్తి మీద సాము వంటిదే. 

కేసీఆర్‌ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. దాని వలన తెలంగాణ రాష్ట్రానికి చాలా మేలు కలిగింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ స్థానంలో బీజేపీ బలపడుతున్నప్పుడు కేసీఆర్‌ దానిని అడ్డుకునేందుకు దాంతో పోరాడకుండా, తన స్థాయిని పెంచుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీపై కత్తి దూయడం మొదలుపెట్టారు. 

దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే ఆయన పట్ల ఎంత అవమానకరంగా ప్రవర్తించారో అందరూ చూశారు. మొదట ఆయనతో సఖ్యతగా ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని గట్టిగా వాదించిన కేసీఆరే, ఆ తర్వాత రాజకీయ కారణాలతో ప్రధాని మోడీపై కత్తులు దూసి రాష్ట్రానికి నష్టం కలిగించారు. 

కానీ కేంద్ర ప్రభుత్వం పట్ల తన వైఖరి మారడం వలన తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పే బదులు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష చూపుతుండటం వలననే తెలంగాణకు నష్టం జరుగుతోందని కేసీఆర్‌ దుష్ప్రచారం చేయించారు. ఇదంతా ఇప్పుడు చరిత్ర. 

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందిప్పుడు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీలు ఉప్పు నిప్పులా ఉంటాయనే సంగతి తెలిసిందే. కనుక రేవంత్‌ రెడ్డి కూడా సిఎం కుర్చీలో కూర్చోగానే ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూస్తారనుకుంటే, ఆయన చాలా సఖ్యతగా వ్యవహరిస్తుండటం విశేషం.

నిన్న అదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు, సిఎం రేవంత్‌ రెడ్డి కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా, ప్రధాని నరేంద్రమోడీ తనకు పెద్దన్న వంటివారని, తెలంగాణ అభివృద్ధికి ఆయన సహాయసహకారాలు చాలా అవసరమని సభా ముఖంగా చెప్పారు. 

తన ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన వ్యవస్థలను గౌరవిస్తుందని, గవర్నర్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటుందని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. 

తన ప్రభుత్వం కోరిన వెంటనే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ భూములను కేటాయించినందుకు, టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు, రాష్ట్రాభివృద్ధికి సబందించిన ఇంకా అనేక అంశాలపై సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేసినందుకు సిఎం రేవంత్‌ రెడ్డి సభాముఖంగా ప్రధాని నరేంద్రమోడీకి అర్దమయ్యేందుకుగాను హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసంగించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తెలంగాణను కూడా గుజరాత్‌లాగా అభివృద్ధి చేసి, దేశాభివృద్ధి, దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి ఈవిదంగా మాట్లాడటం పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సహా అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. 

ఏది ఏమైనప్పటికీ కేంద్రంతో రాష్ట్రాలు సఖ్యతగా ఉండటం ఎంత అవసరమో, ఉంటే ఏవిదంగా లాభపడతాయో గ్రహించేందుకు ఇదే చక్కటి నిదర్శనం... కాదా? కానీ బిఆర్ఎస్ పార్టీ దీనిని కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలని అభివర్ణింస్తోంది.. అది అప్రస్తుతం.


Related Post