లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు బిఆర్ఎస్ ఎంపీలు కారు దిగి కాషాయం కండువా కప్పుకోగా, తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కూడా కారు దిగి కాంగ్రెస్ హస్తం అందుకునేందుకు సిద్దపడుతున్నారు.
నిజానికి ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. కానీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే మొట్ట మొదట సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మళ్ళీ నిన్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కనుక నేడో రేపో ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఖాయమే.
మరికొందరు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పడిపోతుంది. అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలద్రోసే ఆలోచనలు పక్కన పెట్టి ముందు బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవలసి ఉంటుంది.