అసదుద్దీన్‌ ఓవైసీని ఓడించేందుకు బీజేపీ పెద్ద ప్లాన్ వేసిందిగా?

March 03, 2024


img

హైదరాబాద్‌ నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఘనుడు మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌  ఓవైసీ. పైగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో హిందూ ఓటర్లలో సమానంగా ముస్లిం ఓటర్లున్నారు. కనుక అసదుద్దీన్‌  ఓవైసీని ఓడించడం దాదాపు అసంభవమే.

అటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, ఎంపీని రాజకీయాలలో కొత్తగా ప్రవేశిస్తున్న కొంపెల్ల మాధవీలతతో చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. 

మాధవీలత పాతబస్తీలోనే పుట్టి పెరిగారు. కోఠి మహిళా కాలేజీలో డిగ్రీ చేశారు. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. లోపాముద్ర ఫౌండేషన్ పేరుతో పాతబస్తీలో చిరకాలంగా సామాజిక సేవలు చేస్తున్నారు.

కోవిడ్ కష్టకాలంలో ఆ సంస్థ ద్వారా పాతబస్తీ, చుట్టుపక్కల ప్రాంతాలలోని పేద ప్రజలకు ప్రతీరోజు ఆహారం అందించి మంచి పేరు సంపాదించుకున్నారు. 

మాధవీలత పాతబస్తీలో పేదలకు వైద్య శిబిరాలు, మహిళలకు టైలరింగ్ శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రజ్ఞాపూర్ వద్ద సువిశాలమైన గోశాల నిర్మించి వందలాది ఆవులను కాపాడుతున్నారు.

హైదరాబాద్‌ పరిధిలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, హిందూ మతం విశిష్టత గురించి మాధవీలత అందరినీ ఆకట్టుకునేలా అనర్గళంగా ప్రసంగిస్తుంటారు. 

హైదరాబాద్‌ నగరానికి తరచూ పీఠాధిపతులను, సాధువులను తీసుకువచ్చి వారితో ప్రవచనాలు వగైరా చెప్పిస్తుంటారు. మాధవీలత భారతనాట్య కళాకారిణిగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. 

ఈ నేపధ్యం అంతా పరిశీలించిన తర్వాతే బీజేపీ అధిష్టానం, హైదరాబాద్‌లో అసదుద్దీన్‌  ఓవైసీని ఓడించగల మహిళ మాధవీలతే అని గట్టి నమ్మకంతో ఆమె ఇంకా పార్టీలో చేరక మునుపే ఆమె పేరుని తొలి జాబితాలోనే ప్రకటించింది. 

హైదరాబాద్‌లో అసదుద్దీన్‌  ఓవైసీపై బీజేపీ కూడా మరో ముస్లిం నాయకుడిని నిలబెడితే, ముస్లింలు ఖచ్చితంగా మజ్లీస్‌ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న అసదుద్దీన్‌  ఓవైసీకే ఓట్లు వేసి గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజరుద్దీన్‌ని బరిలో దించుతోంది. 

కనుక హైదరాబాద్‌ పరిధిలో హిందూ ఓటర్లందరినీ ఆకర్షించేందుకు బీజేపీ చాలా తెలివిగా మాధవీలతని ఎంచుకొంది. అప్పుడు ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీల మద్య చీలిపోతాయి.

కానీ హిందూ ఓటర్లు కాంగ్రెస్‌ అభ్యర్ధి మహమ్మద్ అజారుద్దీన్ కంటే హిందూమతం పరిరక్షణకు, ముఖ్యంగా సమాజంలో అన్ని వర్గాల నిరుపేదలకు సాయపడుతున్న బీజేపీ అభ్యర్ధి మాధవీలతవైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కనుక బీజేపీ ఈసారి చాలా తెలివిగా అభ్యర్ధిని ఎంపిక చేసిన్నట్లు భావించవచ్చు.


Related Post