పాపం రాజయ్య... ఇప్పుడెలా?

March 01, 2024


img

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేసేశారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలనుకున్నారు. ఇందుకోసం సిఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు కూడా. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదు.

ఆయన బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని అణిచివేసేందుకు గట్టిగా ప్రయత్నించారు. దాంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలు ఆయనతో పదేళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటే ఎలా ఒప్పుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో తాటికొండ రాజయ్యని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని వారు సిఎం రేవంత్‌ రెడ్డికి లేఖలు వ్రాసి తమ అభ్యంతరం తెలియజేస్తున్నారు. 

పిసిసి అధ్యక్షుడు కూడా అయిన రేవంత్‌ రెడ్డి సొంత పార్టీ నేతలను, కార్యకర్తలను కాదని తాటికొండ రాజయ్యని చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. పైగా నిత్యం ఏదో ఓ వివాదం సృష్టించే ఆయనను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే, పార్టీకి, ప్రభుత్వానికి కూడా కొత్త తలనొప్పులు మొదలవుతాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. 

కానీ తాటికొండ రాజయ్య మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు పట్టువదలని విక్రమార్కుడులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆయన ద్వారా సిఎం రేవంత్‌ రెడ్డికి నచ్చజెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పొంగులేటిని కూడా కలిసి అటువంటి ఆలోచనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు నిరాకరిస్తే తాటికొండ రాజయ్య పరిస్థితి ఏమిటి?


Related Post