మేడిగడ్డ యుద్ధంలో గెలిచేది ఎవరైనా ఓడిపోయేది రైతులేగా

March 01, 2024


img

మేడిగడ్డ బ్యారేజి వేదికగా అధికార కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న యుద్ధంలో ముందుగా కాంగ్రెస్‌ కత్తులు దూయగా ఇప్పుడు బిఆర్ఎస్‌ సిద్దమవుతోంది. ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌ నుంచి బస్సులలో మేడిగడ్డ బ్యారేజి సందర్శనకు బయలుదేరారు.

మేడిగడ్డని సందర్శించిన తర్వాత వారు అక్కడి నుంచి అన్నారం బ్యారేజి వద్దకు వెళ్తారు. బిఆర్ఎస్‌ కూడా బ్యారేజి వద్దనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి, వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయబోతోంది.   

మేడిగడ్డకు బయలుదేరే ముందు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజిలో 84 పిల్లర్లు ఉంటే వాటిలో మూడు మాత్రమే క్రుంగాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వాటికి మరమత్తులు చేయించకుండా, వర్షాకాలం మొదలయ్యేవరకు అలాగే ఉంచేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వరదలలో కొట్టుకుపోయేలా చేయాలని కుట్ర పన్నుతోంది. లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించేందుకు కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుని ఈవిదంగా దెబ్బ తీసి రైతులకు తీరని నష్టం కలిగించబోతోంది. 

కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలకు రైతులను, రాష్ట్రాన్ని బలిచేస్తోంది. దానిని అడ్డుకునేందుకే మేము నేడు మేడిగడ్డ బ్యారేజి సందర్శనకు బయలుదేరి వెళుతున్నాము. అక్కడి నుంచే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాము,” అని అన్నారు. 

మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగిపోవడం సాంకేతిక లోపం లేదా మానవ తప్పిదమే అయిన్నప్పటికీ దాంతో బిఆర్ఎస్‌ పార్టీ అప్రదిష్ట పాలవుతోందనేది కూడా వాస్తవం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అందుకే ఈ సమస్యని హైలైట్ చేసి బిఆర్ఎస్‌ పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. 

బిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నట్లు బ్యారేజీలో మూడు పిల్లర్లు మరమత్తు చేయిస్తే, బహుశః ఈ సమస్య తీరిపోవచ్చు. మళ్ళీ బ్యారేజిని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 

అయితే దెబ్బ తిన్న మూడు పిల్లర్లని పునాదులతో సహా పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్తగా పునర్నిర్మించాల్సి ఉంటుంది. దీనికి కనీసం 6-8 నెలల సమయం పడుతుందని నిపుణులు చెపుతున్నారు. అంటే వర్షాకాలం మొదలయ్యేనాటికి మరమత్తులు పూర్తి చేయలేరన్న మాట! 

అటువంటప్పుడు బ్యారేజిలో మిగిలిన పిల్లర్లు దెబ్బ తినకుండా, వర్షాకాలంలో నీటిని నిలువ చేసుకొనేందుకు ఏమి చేయాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలి. 

కానీ కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ పార్టీల మద్య ఆధిపత్య పోరు సాగుతోంది కనుక ఈ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరపడకపోవచ్చు. కనుక ఈ యుద్ధంలో రెండు పార్టీలలో ఏది గెలిచినా, ఓడిపోయేది మాత్రం ఖచ్చితంగా రైతులే అని చెప్పక తప్పదు.


Related Post