కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ లీగల్ సెల్... మంచి నిర్ణయమే!

February 29, 2024


img

ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష నేతలకు, కార్యకర్తలకు అధికార పార్టీ నేతలు, పోలీసుల నుంచి వేధింపులు తప్పవు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో కూడా ఈ విపరీత ధోరణి కేసీఆర్‌ హయాంలోనే ప్రారంభం అయ్యింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఇంకా విపరీతంగా ఉంది. 

ఆ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే జగన్‌ ప్రభుత్వం జైలులో పెట్టించింది. పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలపై అనేక కేసులు నమోదు చేయించి కోర్టుల చుట్టూ తిప్పుతూనే ఉంది. 

తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో కాంగ్రెస్‌, బీజేపీ, ముఖ్యంగా తెలంగాణ జన సమితి, తీన్మార్ మల్లన్న వంటివారిని చాలానే వేధించింది. వారి కార్యాలయాలపై దాడులు చేయించింది. జిల్లా పర్యటనలకు బయలుదేరితే పోలీసులతో అడ్డుకోవడమో లేదా గృహ నిర్ణబందం చేయడమో చేసేది. 

ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ నేతలు తమ గాంధీ భవన్‌లో, ప్రొఫెసర్ కోదండరాం తన ఇంట్లో నిరసన దీక్షలు చేసుకోవలసి రావడం అందరూ చూశారు. తమ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షాలను వేధించినందుకు ఇప్పుడు తమకూ వేధింపులు భరించక తప్పదని బిఆర్ఎస్ పార్టీ త్వరగానే గ్రహించింది. 

ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ బెదిరించడం పెద్ద తప్పు. అందువల్ల కాంగ్రెస్‌ నేతలు కూడా తమ నేతలను, కార్యకర్తలను వేధించవచ్చని, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు పోలీసులతో కేసులు పెట్టించవచ్చని గ్రహించిన్నట్లే ఉంది. 

అందుకే అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వారికి బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సహాయం అందించాలని నిర్ణయించి ట్విట్టర్‌లో ఆ విషయం తెలియజేసింది. బిఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా సహాయ సహకారాలు లీగల్ సెల్ అందించేందుకు సిద్దంగా ఉంటుందని దానిలో పేర్కొంటూ, సమస్యలు ఎదురైనప్పుడు 437266666 నంబరుకు వాట్సప్ ద్వారా కానీ ఫోన్ చేసి గానీ తెలియజేసి సహాయం పొందవచ్చని బిఆర్ఎస్ పార్టీ తెలియజేసింది. 

పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయ సహాయం అందించి తోడ్పడాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే. అయితే పార్టీ అధినేతల నిర్ణయాల వలన కార్యకర్తలు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం సరికాదు కదా?



Related Post