లోక్‌సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్

February 28, 2024


img

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతుంటే బిఆర్ఎస్ పార్టీకి వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. ఇటీవల జీహెచ్‌ఎంసీ డెప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, తాజాగా నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు పార్టీకి గుడ్ బై చెప్పేసి  రేపు బీజేపీలో చేరిపోబోతున్నారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో ఎంపీ మూటాముల్లె సర్దుకొని బీజేపీలో చేరిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మెదక్ సీటు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరిస్తే మరో బిఆర్ఎస్ ఎంపీ కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన నేతలను ఆకర్షించేందుకే బీజేపీ ఇంకా లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేయకుండా తెర వెనుక వారితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవి ఫలించడంతో నేడు బిఆర్ఎస్ ఎంపీ రాములు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. 

బహుశః ఈ వారంలోనే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిద్దరు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చేవారి విషయంలో స్పష్టత రాగానే బీజేపీ అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దంగా ఉంది. 

ఓ వైపు కాంగ్రెస్ పార్టీ, మరో వైపు బీజేపీ బిఆర్ఎస్ పార్టీ నేతలను ఆకర్షించి ఎత్తుకుపోతుంటే, వారిని చేజారిపోకుండా కాపాడుకోలేక కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులు అవస్థలు పడుతున్నారు.

ఆనాడు కాంగ్రెస్‌, టిడిపి నేతలు, ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఎత్తుకుపోయినప్పుడు ఆ రెండు పార్టీలు అనుభవించిన క్షోభని ఇప్పుడు కేసీఆర్‌ స్వయంగా అనుభవించాల్సివస్తోంది. 


Related Post