సిఎం రేవంత్ హెచ్చరికలు, సవాళ్ళు దేనికంటే...

February 28, 2024


img

మంగళవారం చేవెళ్ళ కాంగ్రెస్‌ జన జాతర సభలో సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందే ప్రకటించి ఉండి ఉంటే 30 సీట్లు కూడా గెలుచుకోని ఉండేది కాదని కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌... నీకు దమ్ముంటే మీ తండ్రి పేరు చెప్పుకోకుండా లోక్‌సభ ఎన్నికలలో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించగలవా?” అని సవాలు విసిరారు.  

ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతూ, “నేను నీలాగ తండ్రి పదవులు ఇస్తే వచ్చి కుర్చీలో కూర్చోలేదు. ఆయాచితంగా ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఆశించలేదు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎంతో కష్టపడి పనిచేసి ఈ స్థాయికి ఎదిగినవాడిని. మీ కుట్రలు, కుతంత్రాలకు బలై చంచల్‌గూడా జైలులో మగ్గినవాడిని,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

“మా ప్రభుత్వాన్ని మూడు లేదా ఆరు నెలల్లో కూల్చేస్తామని తండ్రీ కొడుకులు బెదిరిస్తున్నారు. మీరు కూల్చేయడానికి మాది అల్లాటప్పా ప్రభుత్వం కాదు. మా పార్టీ కార్యకర్తలు నా వెంట ఉన్నంతవరకు నువ్వు, మీ బిఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వాన్ని తాకలేరని గుర్తుంచుకో,” అంటూ మరోసారి బిఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌కు బహిరంగ సభలో వేలాది ప్రజల ముందు ఈ సవాలు చేయడం, తన ప్రభుత్వం కూల్చివేత గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్‌ని హెచ్చరించడం ఏదో ఆవేశంతో చేసింది కాదనే చెప్పొచ్చు. ఈవిధంగా  మాట్లాడుతూ సిఎం రేవంత్‌ రెడ్డి తాను చాలా బలమైన నాయకుడినని ప్రజలు గ్రహించేలా చేస్తున్నారని భావించవచ్చు. 

ముఖ్యమంత్రి పదవిని కేటిఆర్‌ వారసత్వంగా పొందాలనుకున్నారని కాని తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరానని చెప్పడం ద్వారా ప్రజలలో తన పట్ల గౌరవం పెరిగేలా చేసుకొన్నారని చెప్పవచ్చు. 

అలాగే కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి పదేపదే గట్టిగా నొక్కి చెపుతుండటం ద్వారా ఆయన అటువంటి ఆలోచనలు చేయకుండా ముందే కట్టడి చేస్తున్నట్లు భావించవచ్చు. 

ఒకవేళ కేసీఆర్‌ నిజంగా రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలే కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీని కూడా మరింత వ్యతిరేకిస్తారు. ఆ భయంతో కేసీఆర్‌ అటువంటి ఆలోచన చేయడం మానుకుంటారని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లున్నారు.


Related Post