మేడిగడ్డపై యుద్ధానికి బిఆర్ఎస్ పార్టీ కూడా సిద్దం

February 27, 2024


img

కేసీఆర్‌ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మొట్ట మొదటిదైన మేడిగడ్డ బ్యారేజిలో మూడి పియర్స్ క్రుంగిపోవడంతో సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు చేస్తున్న విమర్శలకు బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేక తడబడుతోంది. అయితే ఇంత కాలానికి వారిని ఏవిదంగా ఎదుర్కోవాలో ఉపాయం తట్టిన్నట్లే ఉంది. 

అందుకే మార్చి 1 నుంచి ‘ఛలో మేడిగడ్డ’కు సిద్దమైంది. ఆ బ్యారేజితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని బ్యారేజీలు, కాలువలు, పంప్ హౌసులను పరిశీలించేందుకు సుమారు 150-200 మంది బిఆర్ఎస్ ప్రతినిధులను వెంటబెట్టుకొని బస్సులలో బయలుదేరబోతున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. 

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజి మాత్రమే అన్నట్లు కాంగ్రెస్‌ మంత్రులు మాట్లాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. బ్యారేజికి ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించి క్రుంగిన మూడు పియర్స్‌కి మరమత్తులు చేయవచ్చు.

 గతంలో కడెం, గుండ్లవాగు, మూసీ, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలో ఇటువంటి సమస్యలు వస్తే వెంటనే మరమత్తులు చేసేవారు. కానీ ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాపై బురద జల్లెందుకు మేడిగడ్డ బ్యారేజికి మరమత్తులు చేయించకుండా తాత్సారం చేస్తోంది. కాంగ్రెస్‌ తన రాజకీయాల కోసం ఈ నీటిపై ఆధారపడున్న రైతులకు కూడా తీవ్ర నష్టం కలిగించడానికి వెనకాడట లేదు. 

కాంగ్రెస్‌ ఆరోపణలు, కుట్రలు తిప్పి కొట్టేందుకే మార్చి 1న ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమం ప్రకటించాల్సి వచ్చింది. మేము కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించి, దాని వలన తెలంగాణకు కలుగుతున్న మేలుని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తాము,”అని అన్నారు.       Related Post