తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ లోక్‌సభకు పోటీ?

February 27, 2024


img

కాంగ్రెస్‌ అగ్రనేత, కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఈసారి తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు అంగీకరించిన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చాలా పట్టుదలగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌, ఈసారి సోనియా గాంధీని మెదక్ లేదా ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరింది.

కానీ ఆరోగ్యకారణాల చేత ఆమె నిరాకరించడంతో, ఆమె స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ గాంధీని పోటీ చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కోరగా అందుకు ఆయన అంగీకరించిన్నట్లు తాజా సమాచారం. రాహుల్ గాంధీ ఖమ్మం లేదా భువనగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

మార్చి 13 తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల కమీషన్‌ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులను ఖరారు చేసుకుని ప్రకటిస్తున్నాయి. 

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యాని రాజా, ఈసారి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌ నుంచి పోటీ చేస్తారని ప్రకటించడం గమనిస్తే, ఈసారి రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం ఖాయమనే భావించవచ్చు.


Related Post