కాంగ్రెస్‌లో మార్పులని విహెచ్ గమనించలేకపోతున్నారా?

February 27, 2024


img

మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్‌ నేత వి హనుమంతరావు సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను పార్టీలో చాలా సీనియర్‌ని. పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నాను. ఖమ్మం నియోజకవర్గంలో సమస్యలపై కూడా నేను పోరాడుతూనే ఉన్నాను. కనుక లోక్‌సభ ఎన్నికలలో నన్ను ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. 

మా అధిష్టానం నా సీనియర్‌ని గుర్తించి, గౌరవించి నాకు తప్పకుండా ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తుందనే భావిస్తున్నాను. పార్టీలోకి కొత్తగా వచ్చి చేరిన వారికి టికెట్లు ఇస్తున్నప్పుడు నా వంటి సీనియర్‌కు ఇవ్వకుండా పక్కన పెట్టాలనుకుంటే సరికాదని భావిస్తున్నాను,” అని అన్నారు. 

రేవంత్‌ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా నియమించినప్పుడే కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచనా విదానం మారిందని స్పష్టమైంది. పార్టీలో సీనియర్లందరూ రేవంత్‌ రెడ్డిని ఎంతగా వ్యతిరేకించినా, కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు అండగా నిలబడింది. శాసనసభ ఎన్నికలలో, గెలిచిన తర్వాత కూడా రేవంత్‌ రెడ్డికి అండగా నిలబడుతోంది. 

ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్లు, పదవులకు సీనియారిటీయే ప్రధాన అర్హతని భావించి ఉండి ఉంటే రేవంత్‌ రెడ్డికి ఈ పదవులు లభించి ఉండేవి కావు. రాష్ట్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగేది కాదు. 

కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పుని, అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఎంత ముఖ్యమో వి హనుమంతరావు గ్రహించిన్నట్లు లేదు. 

అందుకే తన సీనియారిటీని చూసి ఖమ్మం టికెట్‌ ఇమ్మనమని అడుగుతున్నారు. కానీ టికెట్‌ కోసం సీనియారిటీ సరిపోతుంది కానీ ఎన్నికలలో గెలుపుకి అదొక్కటే సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి. 

వాటన్నిటినీ కాంగ్రెస్‌ అధిష్టానం, ఎన్నికల కమిటీ, సిఎం రేవంత్‌ రెడ్డి పరిగణనలోకి తీసుకునే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. కనుక వయసు మీద పడుతున్న విహెచ్ టికెట్‌ కోసం రాద్దాంతం చేసి నవ్వులపాలయ్యే బదులు, పార్టీ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు కృషి చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది. 


Related Post