కారు సర్వీసింగ్‌కు వెళ్ళింది: కేటీఆర్‌

February 25, 2024


img

గత రెండున్నర దశాబ్ధాలుగా బిఆర్ఎస్ పార్టీని చూస్తున్నవారు, ఒకే ఒక్కసారి ఎన్నికలలో ఓడిపోగానే ఆ పార్టీ దయనీయ స్థితిలోకి జారుకోవడం చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్‌ వారి మద్య లేనప్పుడు ఆ పార్టీ ఇంత బలహీనంగా కనిపిస్తుండటం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ఓ పక్క పలువురు బిఆర్ఎస్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. మరోపక్క లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నా, బిఆర్ఎస్ పార్టీలో ఆ సందడి, ఉత్సాహమే కనబడటం లేదు.

కేసీఆర్‌ని శాసనసభకు రావాలని కాంగ్రెస్‌ మంత్రులు పదేపదే సవాలు విసిరినా వెళ్ళకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించిందనే చెప్పాలి. 

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టిన అప్పులు, అవినీతి చిట్టాలు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలలో లోపాలు కళ్ళకు కొట్టవచ్చిన్నట్లు కనబడుతుంటే వాటికి సమాధానం చెప్పుకోలేక బిఆర్ఎస్ తడబడుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో హరీష్ రావు నోరుజారి తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని బయటపెట్టుకొని తనకు, పార్టీకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించారు. 

ఈ పరిస్థితిలో ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరే పార్టీ తరపున కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోరాడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నేడు నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సన్నాహక సమావేశం కొరకు అచ్చంపేటకు వెళ్ళినప్పుడు, అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన కారు సర్వీసింగ్ కోసమే వెళ్ళింది. త్వరలోనే తిరిగి రాగానే రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది.

ఒక్క ఏడాది పాటు పార్టీ నేతలు కార్యకర్తలని కాపాడుకుంటే, ఆ తర్వాత వారే మనల్ని కాపాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయలేక పధకాలు ఎగ్గొట్టి తప్పించుకునేందుకు దారులు వెతుకుతోంది.

తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేస్తూ కృష్ణానదిపై ప్రాజెక్టులను కెఆర్ఎంబీకి అప్పగించేసింది. ఇప్పుడు మన రైతులకు నీళ్ళు కావాలంటే ఢిల్లీ పోయి అడ్డుక్కోవలసిన దుస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించింది.

 తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే బిఆర్ఎస్ పార్టీ చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్దంగా ఉంది,” అని అన్నారు.


Related Post