కల్వకుంట్ల కవితకు మళ్ళీ నోటీస్... ఈసారి సీబీఐ

February 22, 2024


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈసారి సీబీఐ నోటీస్ పంపింది. ఈ నెల 26వ లిక్కర్ స్కామ్‌ కేసులో  ఢిల్లీలో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఈ కేసుని మొదట సీబీఐ విచారణ జరపగా దానిలో భారీగా మనీ లాండరింగ్ జరిగిన్నట్లు ఈడీ గుర్తించడంతో, ఈడీ కూడా ఈ కుంభకోణంలో నిందితులుగా పేర్కొనబడుతున్న పలువురుని అరెస్ట్ చేసింది. 

వారిలో కల్వకుంట్ల కవిత ఛార్టడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఒంగోలు వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిశోడియా తదితరులున్నారు. వీరందరూ వేర్వేరు కారణాలను చూపి బెయిల్‌ పొంది బయటకు వచ్చేశారు. 

ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న కల్వకుంట్ల కవిత మూడుసార్లు ఢిల్లీ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన తర్వాత మహిళనైన తనను ఒంటరిగా ప్రశ్నించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఈడీ ఆమెను విచారణకు రప్పించలేకపోతోంది. ఇప్పుడు సీబీఐ ఆమెను విచారణకు హాజరుకావాలంటూ నోటీస్ జారీ చేయడంతో మళ్ళీ కల్వకుంట్ల కుటుంబం, బిఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. బహుశః ఆమె మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. 

కానీ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కల్వకుంట్ల కవితకు మొదట ఈడీ, తర్వాత సీబీఐ నోటీసులు పంపించడంతో దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నంత కాలం బీజేపీ బలపడనీయదు. శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి ఇప్పుడు బిఆర్ఎస్‌ చాలా బలహీనంగా ఉంది కనుక ఈ కేసుల పేరుతో కేసీఆర్‌ని లొంగదీసుకొని, ఒత్తిడి పెంచి ఆ పార్టీ నేతలను బీజేపీలోకి రప్పించుకోవాలని భావిస్తోందేమో?


Related Post