బీజేపీతో బిఆర్ఎస్‌ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి

February 20, 2024


img

గత కొన్ని రోజులుగా బీజేపీతో బిఆర్ఎస్‌ పొత్తు పెట్టుకోబోతోందని, అందుకే కేసీఆర్‌ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ స్పందిస్తూ, “ఈసారి ఎవరైనా బీజేపీతో బిఆర్ఎస్‌ పొత్తు అని అంటే చెప్పుతో కొట్టండి. కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షాల కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా మాపార్టీతో బిఆర్ఎస్‌ పొత్తుని అంగీకరించే ప్రసక్తే లేదు,” అని అన్నారు. 

మంగళవారం తాండూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్రని బండి సంజయ్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో 17కి 17 సీట్లలో బీజేపీ అభ్యర్ధులనే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే తెలంగాణకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు సాధించుకోగలుగుతాము.

బీజేపీ వెనక శ్రీరాముడు వంటి ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. బిఆర్ఎస్‌ పార్టీ వెనుక కుట్రలు, కుతంత్రాలు చేసే కేసీఆర్‌ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యి రాష్ట్రంలో బీజేపీని సైడ్ చేసేయాలనుకుంటున్నారు. అందుకే బిఆర్ఎస్‌, బీజేపీ పొత్తులంటూ పుకార్లు పుట్టిస్తూ రాష్ట్రంలో బీజేపీని దెబ్బ తీయాలని కుట్రలు పన్నుతున్నాయి,” అని అన్నారు. 

అయితే శాసనసభ ఎన్నికలలో బీజేపీకి విజయవకాశాలు ఉన్నప్పుడు, కేసీఆర్‌ ఒత్తిడి మేరకే బీజేపీ అధిష్టానం హటాత్తుగా బండి సంజయ్‌ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవిలో నుంచి తప్పించేసుకొని ఓడిపోవడం అందరూ చూశారు.

ఎన్నికల వేళ ఐ‌టి శాఖ అధికారులతో కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేయించించి బిఆర్ఎస్‌ పార్టీకి తోడ్పడిందో అందరూ చూశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిమనీష్ సిసోడియాని అరెస్ట్ చేయించి, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని కూడా అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

కానీ అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత జోలికి మాత్రం పోవడం లేదు. బిఆర్ఎస్‌, బీజేపీల మద్య బలమైన అనుబంధం ఉందనడానికి ఇంత గొప్ప నిదర్శనాలు ఏముంటాయి? కనుక ముందు బండి సంజయ్‌ చెప్పుతో కొట్టుకోవలసి ఉంటుంది.


Related Post