లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ?

February 20, 2024


img

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా ఓడిపోయిన బిఆర్ఎస్‌ పార్టీకి త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలు తన సత్తా నిరూపించుకునేందుకు ఓ గొప్ప అవకాశం లేదా మరో అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. 

ఈసారి తన 9 సిట్టింగ్ సీట్లను మళ్ళీ గెలుచుకొని, అదనంగా మరికొన్ని సీట్లు గెలుచుకోగలిగితే బిఆర్ఎస్‌ మళ్ళీ పుంజుకోగలదు. అదే వాటిలో కొన్ని కోల్పోతే బిఆర్ఎస్‌ పార్టీ నుంచి వలసలు మొదలయ్యి పార్టీ విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌, బీజేపీలు ఎన్ని సీట్లు గెలుచుకుంటాయనే దానిపై అప్పుడే మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తున్నాయి. 

పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సంస్థలు కలిసి సర్వే చేసి వాటి నివేదికని ప్రకటించాయి. దాని ప్రకారం లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ: 8 నుంచి 10 సీట్లు, బిఆర్ఎస్ పార్టీ: 3 నుంచి 5 సీట్లు, బీజేపీ 2 నుంచి 4 సీట్లు, ఒకటి ఇతరులు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 

వాటి నివేదిక ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 40%, బిఆర్ఎస్ పార్టీకి 31%, బీజేపీకి 23%, ఇతరులకు 6% ఓట్లు లభించవచ్చు. 

కాంగ్రెస్ పార్టీకి శాసనసభ ఎన్నికలలో 39% రాగా లోక్‌సభ ఎన్నికలలో మరో ఒక్క శాతం ఓట్లు పెరుగబోతున్నట్లు సర్వేలో తేలిందని పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సంస్థలు తెలిపాయి.

బీజేపీకి కూడా ఈసారి 9% అధికంగా ఓట్లు పడబోతున్నాయని, బిఆర్ఎస్ పార్టీ 6% ఓట్లు కోల్పోబోతోందని తెలిపాయి.

ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రతీ మూడు శాసనసభ నియోజకవర్గాలలో సర్వే చేసిన్నట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి.

 



Related Post