బీజేపీతో పొత్తుకి కేసీఆర్‌ సిద్దమే కానీ...

February 18, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు, పార్టీల బలాబలాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలో ఇప్పుడు రెండో స్థానం కోసం బిఆర్ఎస్‌, బీజేపీలు పోరాడుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో రెండో స్థానంలో ఉండబోయే పార్టీ ఏదో తేలిపోతుంది. 

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఓడిపోయినప్పటి నుంచే ఆ పార్టీలో నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలైపోయాయి. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఇంకా ఎక్కువైపోయాయి. 

ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ కనీసం 8-9 సీట్లు గెలుచుకోలేకపోతే, కేసీఆర్‌ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు అనుమానాలు మొదలవుతాయి. కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత వలసలు ఇంకా పెరిగిపోవచ్చు. అదే జరిగితే బిఆర్ఎస్‌ పార్టీ విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

ఇదీగాక ‘కేసీఆర్‌ అండ్ కో’ కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్దం చేస్తున్న కేసులు, మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు ఉండనే ఉన్నాయి. కనుక బిఆర్ఎస్ పార్టీకి అత్యవసరంగా ‘కేంద్ర ప్రభుత్వ రక్షణ కవచం’ చాలా అవసరం. అందుకే బీజేపీతో బిఆర్ఎస్‌ పొత్తు పెట్టుకోబోతోందంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. 

కానీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీలపై కత్తులు దూసి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పొత్తు కోసం సిద్దమవుతున్నా బీజేపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. బండి సంజయ్‌ ఆ మాట స్పష్టంగా చెప్పేయడమే కాకుండా బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారంటూ బాంబు పేల్చారు. 

రాష్ట్రంలో బిఆర్ఎస్‌ బలంగా ఉన్నంత కాలం బీజేపీ బలపడలేదు. పడనీయదు కూడా. కనుక కేసీఆర్‌, బిఆర్ఎస్‌ బలహీనంగా ఉన్న ఈ సమయంలోనే దానిని నిర్వీర్యం చేయాలనే బీజేపీ ప్రయత్నించకమానదు. బిఆర్ఎస్‌ పార్టీకి నలువైపులా శత్రువులు కమ్ముకొస్తున్నారు. మరి కేసీఆర్‌ తన పార్టీని ఎలా కాపాడుకుంటారో?


Related Post