కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్‌?

February 18, 2024


img

ఈటల రాజేందర్‌ బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా అవమానకరంగా బయటకు వచ్చినప్పటికీ హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ ఆత్మవిశ్వాసంతో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో గజ్వేల్ నుంచి కేసీఆర్‌ మీద పోటీ చేయడమే బెడిసికొట్టింది. గజ్వేల్, హుజూరాబాద్‌ రెండు చోట్ల ఓడిపోవడంతో మాజీ అయ్యారు. 

ఈటల రాజేందర్‌ పిర్యాదులు చేయడం వలననే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తప్పించుకుని, తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నామనే భావన బీజేపీ అధిష్టానంలో ఏర్పడింది. బహుశః అందుకే లోక్‌సభ ఎన్నికలలో ఆయన మల్కాజ్‌గిరి టికెట్‌ అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదేమో? 

ఒకవేళ టికెట్‌ ఇవ్వక, పార్టీలో సముచిత గౌరవం లభించకపోతే ఈటల రాజేందర్‌ స్థాయి రాజకీయ నాయకుడు బీజేపీలో కొనసాగడం చాలా కష్టమే. ఇటీవల హైదరాబాద్‌లో ఓ శుభకార్యంలో ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలు చాలాసేపు మాట్లాడుకున్నారు. 

బహుశః కాంగ్రెస్ పార్టీలో చేరమని వారు ఆయనని కోరి ఉండవచ్చు లేదా ఆయనే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పి ఉండవచ్చు. బీజేపీ అధిష్టానం ఆయనకు మల్కాజ్‌గిరి టికెట్‌ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం కనిపిస్తోంది.


Related Post