శాసనసభలో బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్!

February 17, 2024


img

పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని, రాజకీయాలను కంటిచూపుతో శాసించిన మాజీ సిఎం కేసీఆర్‌కి, బిఆర్ఎస్ పార్టీకి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వరుసపెట్టి షాకులు ఇస్తూనే ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని శాసనసభలో ఇరుకున పెడదామని బిఆర్ఎస్ పార్టీ భావించి అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుని వస్తే, హరీష్ రావు, కేటీఆర్‌ వంటివారు సైతం జవాబు చెప్పుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారు సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు. 

ఈరోజు శాసనసభ సమావేశాలలో బిఆర్ఎస్ సభ్యులకు సిఎం రేవంత్‌ రెడ్డి మరో పెద్ద షాక్ ఇచ్చారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే ముందు కేసీఆర్‌ స్వయంగా ఏర్పాటు చేసిన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికని ఈరోజు శాసనసభలో బయటపెట్టి కేసీఆర్‌, హరీష్ రావులను గట్టిగా నిలదీశారు. 

ఆ నివేదికలో మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మించాలని కేసీఆర్‌ స్వయంగా సూచించారని, కానీ అక్కడ కొత్తగా బ్యారేజి నిర్మించడం కంటే తుమ్మిడిహట్టి వద్ద చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టుని నిర్మించుకోవడం మేలైనది, తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని కేసీఆర్‌ నియమించిన ఇంజనీర్లే పేర్కొన్న విషయాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా శాసనసభలో చదివి వినిపించారు.

ఆ నివేదికలో తుమ్మిడిహట్టి వద్ద 102 మీటర్ల ఎత్తు బ్యారేజి నిర్మిస్తే మహారాష్ట్రలో 1,850 ఎకరాలు ముంపుకి గురవుతుందని, అదే... 151 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 1250 ఎకరాలు ముంపుకి గురవుతుందని నివేదికలో పేర్కొన్న విషయాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి చదివి వినిపించారు. 

ముంపుకు గురయ్యే ఆ 1250 ఎకరాలు పట్టా భూములని, కనుక తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తేలికగా ఒప్పించవచ్చని కూడా నివేదికలో పేర్కొన్న విషయాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి చదివి వినిపించారు. 

తుమ్మిడిహట్టి వద్ద చాలా తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ నిర్మించవచ్చని, ఇన్ని పంప్ హౌసులు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్ళు పారుతాయని, దాని వలన ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుందని నిపుణుల కమిటీ కేసీఆర్‌కు చక్కటి సలహాలు ఇచ్చారని నివేదిక చూస్తే అర్దమవుతోందని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

కానీ మేడిగడ్డ వద్దనే బ్యారేజి నిర్మించాలని ముందే నిర్ణయించుకున్న కేసీఆర్‌, వారి నివేదికని చెత్తబుట్టలో పడేసి వేలకోట్లు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజి నిర్మించారని, ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితిలో ఉందని సిఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 

తెలంగాణకు ఇంత నష్టం కలుగజేసిన కేసీఆర్‌, రాష్ట్రాన్ని ఉద్దరించిన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆక్షేపించారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి నివేదికలోని అంశాలను చదివి వినిపించి కేసీఆర్‌ మీద విమర్శలు చేస్తుంటే సభలో ఉన్న బిఆర్ఎస్ సభ్యులు జవాబు చెప్పుకోలేకపోయారు.


Related Post