బిఆర్ఎస్ వాదనలు ఇలా బెడిసికొడుతున్నాయేమిటి?

February 16, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎన్నికల హామీల విషయంలో బిఆర్ఎస్ పార్టీ బాగానే ఇబ్బంది పెట్టగలిగింది. కానీ పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను అమలు చేయలేనప్పుడు, నెల రోజులు కూడా కాక మునుపే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హామీల గురించి నిలదీయడం చాలా తొందరపాటే కదా? కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెదిరించడంతో కాంగ్రెస్‌ మంత్రులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని బిఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయగలిగారు. 

ముఖ్యంగా... కేసీఆర్‌ సభకు రాకుండా మొహం చాటేస్తుండటంతో బిఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్‌ మంత్రుల ముందు తలదించుకోవలసి వస్తోంది. ఈ నేపధ్యంలో శాసనసభలో కాంగ్రెస్‌ మంత్రులను ఎదుర్కోవడం బిఆర్ఎస్ సభ్యుల వల్ల కావడం లేదు. 

ఈరోజు శాసనసభ సమావేశాలలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, “మేమే జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించాము. మేమే అందరికీ నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నామంటూ మీరు చెప్పుకోవడం, మా ప్రభుత్వం చేసిన పనులకు మీరు క్రెడిట్ తీసుకోవడం సరికాదు...” అని కడియం శ్రీహరి అన్నారు. 

సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందిస్తూ, “మేము, మా ముఖ్యమంత్రిగారు ఎవరూ కూడా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చామని, మేమే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదు. మీరు మొదలుపెట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రెండేళ్ళైనా పూర్తిచేయకుండా మద్యలో వదిలేసి దిగిపోతే, దానికి అవరోధంగా ఉన్న న్యాయపరమైన సమస్యలన్నిటినీ మేము పరిష్కరించి కేవలం రెండు నెలల్లోనే నియామక పత్రాలు ఇస్తున్నామని మాత్రమే చెప్తున్నాము. 

మీరు అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగాలు భర్తీ చేసి ఉండి ఉంటే నేడు మాకు ఈ అవకాశం లభించేది కాదు కదా? మీరు చేయలేక విడిచి పెట్టేసిన పనిని మేము పూర్తిచేసి చూపిస్తుంటే అభినందించాలి కానీ ఇలా విమర్శలు చేయడం తగదు. 

మా ప్రభుత్వం టిఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వబోతోంది. దాంతో  మేము ఏవిదంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామో మీరే చూస్తారు,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా బదులిచ్చారు.


Related Post