తెలంగాణ శాసనసభలో విచిత్ర పరిస్థితులు

February 15, 2024


img

గత పదేళ్ళ బిఆర్ఎస్‌ పాలనలో తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు, ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను ఏదో సాకుతో సస్పెండ్ చేసి సభ నుంచి బయటకు పంపించేస్తూ ఏకపక్షంగా సమావేశాలను నిర్వహించుకునేవారు. సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

నాడు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు ఉండి తమ గొంతు వినిపించాలన్నా వారికి ఆ అవకాశం లభించేది కాదు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి శాసనసభ సమావేశాలలో నెలకొని ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంతవరకు జరిగిన బడ్జెట్‌ సమావేశాలలో బిఆర్ఎస్‌, మజ్లీస్‌, బీజేపీల సభ్యులను ఒక్కసారి కూడా స్పస్పెండ్ చేయలేదు.

బిఆర్ఎస్‌ శాసనసభ్యులు, ముఖ్యంగా మాజీ మంత్రులను సస్పెండ్ చేయకుండా శాసనసభలో నుంచి కదలకుండా కూర్చోబెట్టి, గతంలో వారు చేసిన తప్పులు, వారి అవినీతి భాగోతాలను, వారి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల గురించి వినేలా చేయడమే వారికి పెద్ద శిక్ష అని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్తున్నారు. 

గత సమావేశాలలో కాంగ్రెస్‌ మంత్రులు విద్యుత్ శాఖ అప్పులు, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో అవకతవకల గురించి గట్టిగా మాట్లాడారు. 

ఈసారి బడ్జెట్‌ సమావేశాలలో కృష్ణా జలాలు, ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు క్రుంగిపోవడం తదితర అంశాల గురించి బిఆర్ఎస్‌ సభ్యులను నిలదీస్తున్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కరే వారందరినీ ఎదుర్కోవలసి రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ స్పీకర్‌ వారిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం లేదు! కాంగ్రెస్‌ మంత్రుల ఈ ‘పోలిటికల్ ర్యాగింగ్’ భరించలేక హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బిఆర్ఎస్‌ సభ్యులు ఏదో కుంటిసాకుతో వాకవుట్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. 

నిన్న వెళ్ళిపోయారు... ఈరోజు కూడా అలాగే బయటకు వెళ్ళిపోయారు. దీంతో అంత పెద్ద శాసనసభ బోసిపోయింది. 

నాడు బిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను ఏదో సాకుతో సస్పెండ్ చేసేది. కానీ నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం సభ్యులు బయటకు వెళ్లిపోవద్దని, కేసీఆర్‌ సభకు రాకుండా ఎందుకు మొహం చాటేస్తున్నారని అడుగుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పులిలా ఎదుర్కొంటామని గొప్పలు చెప్పుకొంటున్న బిఆర్ఎస్‌ నేతలు, వారి అధినేత కేసీఆర్‌ శాసనసభ సమావేశాల నుంచి పారిపోతుండటం ఆశ్చర్యమే కదా?  

(Video Courtesy TV5)

Related Post