నేను సిఎం అవుతా! హరీష్ రావు

February 15, 2024


img

మాజీ మంత్రి కేసీఆర్‌ మేనల్లుడు హరీష్ రావు నిన్న ఆవేశంలో తన మనసులో చిరకాల వాంఛని బయట పెట్టుకొని మీడియాకు, పార్టీ అధినేతకి, కాంగ్రెస్‌, బీజేపీలకు కూడా అడ్డంగా దొరికిపోయారు. 

మేడిగడ్డ బ్యారేజిపై ఆయన శాసనసభ లోపల, బయట కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ చిన్న సాకు చూపుతూ సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ప్రాజెక్టు నుంచి నీళ్ళు విడుదల చేయకుండా రైతులకు క్షోభ పెడుతూ, దానికీ బిఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారని హరీష్ రావు వాదిస్తున్నారు. నిన్న శాసనసభ సమావేశాలలో కూడా ఇదే అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. 

సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “రెండు మూడు పిల్లర్లు క్రుంగిపోయి, బ్యారేజి కూలిపోయే స్థితిలో ఉంటే మేడిగడ్డ నుంచి దిగువకు నీళ్ళు వదలాలని హరీష్ రావు వితండవాదం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుని మీకు అప్పగిస్తాము. దమ్ముంటే బాధ్యత తీసుకుని ఈ సమస్యని పరిష్కరించి నీళ్ళు వదిలి చూపాలి,” అంటూ సవాలు విసిరారు. 

రేవంత్‌ రెడ్డి సవాలుని స్వీకరిస్తున్నానని హరీష్ రావు అన్నారు. “రేవంత్‌ రెడ్డి నాకు చాతకాదని ఒప్పుకొని సిఎం పదవికి రాజీనామా చేస్తే నేనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి మేడిగడ్డ బ్యారేజికి మరమత్తులు చేయించి నీళ్ళు పారిస్తానని” హరీష్ రావు అన్నారు. 

హరీష్ రావు సవాలు స్వీకరించడం వరకు బాగానే ఉంది కానీ ‘నేనే ముఖ్యమంత్రి పదవి చేపడతానని’ నోరుజారి మనసులో మాటను బయటపెట్టుకొని అందరికీ దొరికిపోయారు. 

కేటీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలందరూ మరో 10-15 కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పుకుంటునప్పుడు, హరీష్ రావు ‘నేను ముఖ్యమంత్రి అవుతానని’ చెప్పడం గమనిస్తే నేటికీ ఆయనకు మనసులో ఆ కోరిక, ఆ ఆలోచన చాలా బలంగా ఉందని అర్దమవుతోంది. మరి దీనిపై కేసీఆర్‌, కేటీఆర్‌, బిఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఏవిదంగా స్పందిస్తారో?



Related Post