శాసనసభకు వెళ్ళకుండా కేసీఆర్‌ పరువు తీసుకుంటున్నారా?

February 14, 2024


img

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు, బిఆర్ఎస్‌ శాసనసభా పక్ష నేత కేసీఆర్‌ ఎందుకు హాజరు కావడం లేదు? కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెపుతున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని వాదిస్తున్నప్పుడు, నేటికీ మేడిగడ్డ బ్యారేజి నుంచి నీళ్ళు విడుదల చేయవచ్చని వాదిస్తున్నప్పుడు, అదే మాట  శాసనసభకు వచ్చి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు?

శాసనసభకు రానప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం దేనికి?అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు పదేపదే అడుగుతున్నారు. దానికి హరీష్ రావు, కేటీఆర్‌ ఇద్దరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.

కేసీఆర్‌ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు రాకుండా, వీల్ చైర్ వేసుకొని నల్గొండ సభకు ఎందుకు వెళ్ళారు? లోక్‌సభ ఎన్నికలలో ప్రజల సానుభూతి సంపాదించుకోవడానికేనా? అని సిఎం రేవంత్‌ రెడ్డి నిలదీసి ప్రశ్నించారు.

సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు ఇంతగా సవాళ్ళు విసురుతున్నప్పటికీ కేసీఆర్‌ మాత్రం శాసనసభ సమావేశాలకు వెళ్ళడం లేదు. వెళ్తే అవమానిస్తారనే భయం కావచ్చు లేదా ముఖ్యమంత్రిగా శాసనసభను శాశించిన తనను, రేవంత్‌ రెడ్డి శాశిస్తే భరించలేనని కావచ్చు. 

కేసీఆర్‌ ఏ కారణంతో శాసనసభకు మొహం చాటేస్తున్నా, శాసనసభలో కాంగ్రెస్‌ని ఎదుర్కోలేక, తన అవినీతి బయటపడుతుందనే భయంతోనే మొహం చాటేస్తున్నారంటూ సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు చేస్తున్న విమర్శలు, సవాళ్ళతో కేసీఆర్‌ ప్రతిష్ట మసకబారుతోంది. అలాగే బిఆర్ఎస్‌ పరువు కూడా పోతోంది.

కానీ భయం నా బ్లడ్డులోనే లేదు... సోనియాతో కొట్లాడి తెలంగాణ సాధించా... ప్రధాని మోడీకి చమటలు పట్టించానని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్‌, తెలంగాణ శాసనసభలో రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ మంత్రులను ఎదుర్కొనేందుకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రజలు కూడా అనుకొంటున్నారిప్పుడు. కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు ఎందుకు వెళ్ళడం లేదు? అనే ప్రశ్నకు బిఆర్ఎస్‌ నేతలైనా సమాధానం చెప్తారా?


Related Post