మేడిగడ్డ బ్యారేజి గురించి కేసీఆర్‌ ఏమన్నారంటే...

February 14, 2024


img

మాజీ సిఎం, బిఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిన్న నల్గొండలో జరిగిన బిఆర్ఎస్‌ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా మేడిగడ్డ బ్యారేజిలో కొంతభాగం క్రుంగిపోవడంపై మాట్లాడారు. 

“కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఆట బొమ్మకాదు... గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు సస్యశ్యామలం చేసిన వర ప్రదాయిని. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక రిజర్వాయర్లు, టన్నెల్స్, కాలువలు, విద్యుత్ సబ్ స్టేషన్లు, పంపింగ్ హౌసులు ఉన్నాయి. వాటిలో మేడిగడ్డ బ్యారేజి ఒక భాగం మాత్రమే. 

బ్యారేజిలో సుమారు 300 పిల్లర్లు ఉంటే దానిలో రెండు మూడు క్రుంగిపోతే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దానికి వెంటనే మరమత్తులు చేయించే ప్రయత్నం చేయకుండా, దానినే భూతద్దంలో నుంచి పదేపదే చూపిస్తూ మాపై బురద జల్లాలని ప్రయత్నిస్తోంది. 

కాఫర్ డ్యామ్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా విడుదల చేయకుండా ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతాలలో భూములను మళ్ళీ బీడు భూములుగా మార్చేస్తూ తమ నీచ రాజకీయాలకు రైతులను బలి చేస్తోంది. 

గతంలో నాగార్జునసాగర్ పిల్లర్లు క్రుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోలేదా?వాటికి మరమత్తులు చేయించి నేటికీ వాడుకోవడం లేదా?వాటికి మరమత్తులు చేయగలిగినప్పుడు మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లకు ఎందుకు చేయలేరు?

ఇంత పెద్ద ప్రాజెక్టులో కొన్ని చోట్ల లోపాలు ఏర్పడటం సహజం. కానీ వాటిని భూతద్దంలో నుంచి చూపిస్తూ, రైతులకు నీళ్ళు అందించకుండా ఇబ్బంది పెడుతూ మాపై బురద జల్లెందుకే కాంగ్రెస్‌ మంత్రులు ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే మేడిగడ్డ బ్యారేజికి మళ్ళీ వెళ్ళారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు మేలే చేశాము తప్ప కీడు చేయలేదు. కనుక అక్కడికి వెళ్ళడానికి మాకే భయం లేదు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత తప్పకుండా అక్కడికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజిలో ఏర్పడిన లోపాలను పరిశీలించి, మా అభిప్రాయాలు కూడా తెలియజేస్తాము,” అని కేసీఆర్‌ అన్నారు. 


Related Post