బిఆర్ఎస్ పార్టీకి తోడ్పడేందుకే జగన్‌ మరో అస్త్రం అందించారా?

February 13, 2024


img

త్వరలో ఏపీలో శాసనసభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీలో అధికార వైసీపికి చెందిన సీనియర్ నేత, ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డికు అత్యంత సన్నిహితుడు వైవీ సుబ్బారెడ్డి, ఏపీకి రాజధాని లేదు కనుక హైదరాబాద్‌ని మళ్ళీ ఉమ్మడి రాజధాని చేయాలని కేంద్రాన్ని కోరుతామని అన్నారు. 

ఊహించిన్నట్లే దీనిపై మొట్ట మొదట బిఆర్ఎస్ పార్టీ నేతలే స్పందిస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ, “తెలంగాణకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎవరూ తెలంగాణ రాష్ట్రాన్ని కన్నెత్తి చూడలేకపోయారు. కానీ ఇప్పుడు తమకు వంతపాడే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధాని చేయాలని అడగగలుగుతున్నారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం అటువంటి ఆలోచన చేసినా మేము తీవ్రంగా పోరాడుతాము. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌, మేము కాపాడుకుంటాము,” అని అన్నారు. 

ఏపీలో ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధాని చేయాలని అంటే అయిపోదని అందరికీ తెలుసు. కానీ ఈ పేరుతో రెండు రాష్ట్రాలలో సెంటిమెంట్ రగిలించవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య సఖ్యత లేనప్పటికీ  బిఆర్ఎస్, వైసీపిల మద్య చాలా బలమైన సంబంధాలున్నాయి. 

బహుశః అందుకే దీంతో సెంటిమెంట్ రగిలించి ఎన్నికలలో పరస్పరం సహకరించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. 

తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ద లేదని ఇప్పటికే బిఆర్ఎస్ వాదిస్తోంది. నేడు నల్గొండ సభలో కూడా అదే చెపుతోంది. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై బిఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించాలంటే తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం తప్పనిసరి. ఉమ్మడి రాజధాని అంశం కూడా ఇందుకు తోడ్పడుతుంది.


Related Post