హైదరాబాద్‌ని మళ్ళీ ఉమ్మడి రాజధాని చేయాలట!

February 13, 2024


img

దేశంలో మూడు రాజధానులు ప్రతిపాదన చేసిన ఏకైక ప్రభుత్వం ఏపీలోని జగన్‌ ప్రభుత్వం. కానీ పదవీ కాలం పూర్తవుతున్నా వాటిలో విశాఖ రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకపోవడాన్ని ఏపీని పాలిస్తున్న వైసీపి నేతలకు అవమానంగా భావిస్తున్నట్లు లేదు కానీ ఏపీ ప్రజలు మాత్రం సిగ్గుతో తలదించుకుంటూనే ఉన్నారు. 

ఐదేళ్ళు రాజధాని కట్టకుండానే కాలక్షేపం చేసేసిన జగన్ సర్కార్ తాజాగా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెపుతోంది. 

ఏపీ సిఎం జగన్‌ బంధువు, వైసీపి పార్టీలో, ప్రభుత్వంలో కూడా రెండు లేదా మూడో స్థానంలో ఉన్న సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ, “మనకు రాజధాని కట్టుకునే ఆర్ధిక స్థోమత లేదు. అందుకే అన్ని విధాలా అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా చేద్దామని చాలా ప్రయత్నించాము. కానీ న్యాయపరమైన చిక్కుల కారణంగా సాధ్యపడలేదు. 

ఒకవేళ విశాఖ రాజధాని అయ్యుంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ న్యాయపరమైన సమస్యల వలన ఇంకా ఎప్పటికీ విశాఖ రాజధాని అవుతుందో తెలీని పరిస్థితి. కనుక ఏపీకి రాజధాని ఏర్పాటు చేసుకునే వరకు, హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఎన్నికల తర్వాత దీని గురించి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాము,” అని అన్నారు. 



Related Post