రేవంత్‌, కేసీఆర్‌ మైండ్ గేమ్స్... ఎవరు పైచేయి సాధిస్తారో?

February 13, 2024


img

తెలంగాణలో కేసీఆర్‌ని కొట్టే మొనగాడే లేడని ఇంతకాలం కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలందరూ గట్టిగా వాదిస్తుండేవారు. నమ్ముతుండేవారు కూడా. కానీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఓడించి వారిది గుడ్డి నమ్మకమే అని సిఎం రేవంత్‌ రెడ్డి నిరూపించి చూపారు. అది నిజం కూడా.

 ఎందుకంటే, బిఆర్ఎస్ పార్టీపై కేసీఆర్‌కి ఉన్నంత పట్టు, కాంగ్రెస్ పార్టీపై రేవంత్‌ రెడ్డికి లేదు. తమలో తాము కుమ్ములాడుకుంటున్న నేతేలతోనే రేవంత్‌ రెడ్డి, అధికారంలో ఉన్న కేసీఆర్‌ని ఓడించి గద్దె దించి చూపారు. కనుక కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి ఏమాత్రం తీసిపోరాణి, ఆయన కంటే నాలుగాకులు ఎక్కువే చదివారని భావించవచ్చు. 

బిఆర్ఎస్ నేతలు ఆరు గ్యారెంటీ పధకాలు, హామీల గురించి నిలదీస్తూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, కేసీఆర్‌ హయాంలో చేసిన అప్పులు, అవినీతి చిట్టాలను రేవంత్‌ రెడ్డి బయటపెట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చారనే చెప్పొచ్చు. 

ఇప్పుడు కృష్ణా జలాలు, కృష్ణా ప్రాజెక్టులపై శాసనసభలో హరీష్ రావు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను కూడా సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు గట్టిగానే తిప్పికొడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించడాన్ని బిఆర్ఎస్ పార్టీ నిజంగా వ్యతిరేకిస్తున్నట్లయితే, దాని కోసం తమ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెడుతున్న తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ మంత్రులు హరీష్ రావుని నిలదీసినప్పుడు ఆయన ‘యస్... నో’ అని చెప్పలేకపోవడం రేవంత్‌ రెడ్డి రాజకీయ చతురతకు మరో నిదర్శనమే. 

కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి శాసనసభలో చర్చిస్తున్నప్పుడు, కేసీఆర్‌ సమావేశాలకు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఎందుకు కూర్చుంటున్నారు? శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతున్న కేసీఆర్‌ నేడు నల్గొండ సభకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఈ అంశంపై రాజకీయాలు చేయడం కోసమే నల్గొండ సభ పెట్టుకున్నారు కదా? అంటూ కాంగ్రెస్‌ మంత్రుల ప్రశ్నలకి హరీష్ రావు జవాబు చెప్పలేకపోయారు. 

నేడు ఇదే అంశంపై నల్గొండ సభతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో, సిఎం రేవంత్‌ రెడ్డి కూడా తన మంత్రులను, మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని నాలుగు బస్సులలో క్రుంగిన మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించేందుకు బయటలుదేరారు.

ఇదివరకు మేడిగడ్డ బ్యారేజి వద్దకు ఎవరినీ వెళ్ళనీయకుండా కేసీఆర్‌ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటూ బ్యారేజి క్రుంగిన విషయం బయటకు పొక్కకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికలకు ముందు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు, రాహుల్ గాంధీతో కలిసి వెళ్ళి బ్యారేజి క్రుంగిపోయిందనే విషయం బయటపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాల ఇది కూడా ఒకటి.

నేడు నల్గొండ బిఆర్ఎస్ సభలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నప్పుడే, అక్కడ మేడిగడ్డ బ్యారేజివద్ద సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కూడా కేసీఆర్‌ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

కానీ విషాదం ఏమిటంటే, వీరి మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరు, మైండ్ గేమ్స్‌తో  ఎవరో ఒకరు పైచేయి సాధించవచ్చు కానీ రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.


Related Post