సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి జరిగిందా లేదా? జూపల్లి ప్రశ్న

February 13, 2024


img

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలతో కృష్ణా జలాలపై అధికార, విపక్షాల మద్య జరుగుతున్నా వాదోపవాదాలు అందరూ వింటూనే ఉన్నారు. కానీ ఈ నేపధ్యంలో ఆంధ్రా రాజకీయాలలో కేసీఆర్‌ వేలు పెట్టడం గురించి వినిపిస్తుండటమే విశేషం. 

నేడు శాసనసభ సమావేశాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్‌కు పడదు. కనుక ఏపీకి ముఖ్యమంత్రి అవ్వాలని తపిస్తున్న జగన్మోహన్‌ రెడ్డికి కేసీఆర్‌ సాయం చేశారు. దాంతో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు. 

కేసీఆర్‌-జగన్‌కు తోడ్పడటమే కాకుండా రాయలసీమలో ప్రాజెక్ట్ కట్టుకోవడానికి కూడా అంగీకరించారు. కేసీఆర్‌, జగన్‌ మద్య జరిగిన ఈ ఒప్పందం ఖచ్చితంగా క్విడ్-ప్రో. అందుకే ఏపీ ప్రభుత్వం రాయలసీమలో ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నా కేసీఆర్‌ అభ్యంతరం చెప్పలేదు.

దాని వలన తెలంగాణకు నష్టం కలుగుతుందని తెలిసినా పట్టించుకోని కేసీఆర్‌, మాజీ సాగునీటి మంత్రి ఇప్పుడు కృష్ణ జలాల విషయంలో మా ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని నిసిగ్గుగా వాదిస్తున్నారు.

హరీష్ రావుని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. రాయలసీమలో ప్రాజెక్టు నిర్మిస్తుంటే, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి జరిగిందా లేదా? హరీష్ రావు సూటిగా సమాధానాలు చెప్పాలి,” అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు గట్టిగా నిలదీశారు.


Related Post