తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు బిఆర్ఎస్ శాసనసభా పక్షనేత కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిన్న శాసనసభలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గట్టిగా నిలదీశారు.
కృష్ణా జలాలు, కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని కేసీఆర్ భావిస్తున్నప్పుడు, శాసనసభ సమావేశాలకు హాజరయ్యి దాని గురించి తన వాదనలు వినిపించాలి కదా?కానీ తాను ఫామ్‌హౌస్‌లో పడుకుని మిమ్మల్ని (హరీష్ రావు)ని పంపించి మాట్లాడించడం దేనికి?
శాసనసభకు వచ్చి మాట్లాడేందుకు ఇష్టపడని కేసీఆర్, రేపు నల్గొండలో బహిరంగ సభకు మాత్రం ఎలా వెళతారని కాంగ్రెస్ మంత్రులు ప్రశ్నించారు. కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కానీ ఈ అంశంపై బహిరంగ సభ నిర్వహించి రాజకీయాలు చేస్తూ పోయిన పరువును కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు ఆరోపించారు.
మాజీ సాగునీటి శాఖ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కృష్ణ జలాలు, ప్రాజెక్టులపై శాసనసభలో చాలా సమర్ధంగా వాదనలు వినిపిస్తూ, ఒక్కరే కాంగ్రెస్ మంత్రులందరినీ ఎదుర్కోగలిగారు. కానీ శాసనసభ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు రావడం లేదు?అనే వారి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.
ఈ అంశంపై కాంగ్రెస్ మంత్రులు, హరీష్ రావు తమ వాదనలు బలంగా వినిపిస్తూ, ‘తెలంగాణకు మీరే నష్టం చేశారంటే కాదు మీరే నష్టం చేస్తున్నారంటూ’ తీవ్రంగా విమర్శించుకోవడం సభ అట్టుడికిపోయింది.
ఓ వైపూ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు, మరో వైపు బిఆర్ఎస్ నుంచి హరీష్ రావు ఒక్కరే శాసనసభ వేదికగా ఈ అంశంపై భీకర యుద్ధమే చేశారు.
చివరిగా హరీష్ రావుని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూటిగా ఓ ప్రశ్న వేశారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించాన్ని వ్యతిరేకిస్తూ మేము శాసనసభలో తీర్మానం చేస్తాము. బిఆర్ఎస్ పార్టీ కూడా అదే కోరుకుంటోంది కనుక ఈ తీర్మానానికి మీ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా? చెప్పమని నిలదీశారు.
హరీష్ రావు సమాధానం చెపుతూ, తీర్మానంలో “గత ప్రభుత్వం తప్పిందం వలన జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నంలో” అనే వ్యాఖ్యామ్ తొలగిస్తేనే మద్దతు ఇస్తామని చెప్పారు. అంటే మద్దతు ఇవ్వబోమని చెప్పకనే చెప్పారని అర్దమవుతోంది.
ఈ సమస్యతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లి, ప్రజలలో సెంటిమెంట్ రాజేసి బిఆర్ఎస్ లబ్ధి పొందాలనుకుంటే, కాంగ్రెస్ మంత్రులు కూడా ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని శాసనసభ వేదికగా నిరూపించి చూపడానికి మంచి ఎత్తే వేశారు.