నల్గొండలో కేసీఆర్‌కు స్వాగతం చెప్పేందుకు కోమటిరెడ్డి సోదరులు సిద్దం!

February 11, 2024


img

 కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా? వారు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు స్వాగతం చెప్పడం ఏమిటి? ఇద్దరూ పార్టీ మారుతున్నారా?అని అనుకుంటే తొందరపాటే. 

ఈనెల 13న బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో నల్గొండలో భారీ బహిరంగ సభ జరుగబోతోంది. దానిలో పాల్గొనేందుకు కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్‌ అతిరధ మహారధులు తరలిరాబోతున్నారు. కృష్ణా జలాలను ఏపీకి దోచిపెడుతుండటాన్ని, నదిపై ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించడాన్ని ఖండించడానికి ఈ సభ అని ‘కాన్సెప్ట్’ ముందే చెప్పేశారు. 

కనుక సిఎం రేవంత్‌ రెడ్డి వారికి ఇప్పటికే శాసనసభ లోపల, బయటా కూడా గట్టిగా కౌంటర్స్ ఇచ్చి, నల్గొండ వస్తే వారిని ఏవిదంగా ఎదుర్కోవాలో పార్టీ నేతలకు ఓ ‘లైన్’ ఇచ్చేశారు. 

కనుక కోమటిరెడ్డి సోదరులు కూడా దాని ప్రకారమే కేసీఆర్‌ అండ్ కోని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నారు. 

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని కూర్చొని తానే దగ్గరుండి కేసీఆర్‌ పూర్తి చేయిస్తానన్నారు. కానీ పదేళ్ళు అధికారంలోకి ఉన్న అటువైపు తొంగిచూడలేదని కోమటిరెడ్డి సోదరులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో అంబేడ్కర్ చౌక్ వద్ద కేసీఆర్‌ కోసం కుర్చీ వేసి, దానికి గులాబీ కవర్ వేసి సిద్దంగా ఉంచుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

కేసీఆర్‌ సెంటిమెంట్ రాజేసి రాజకీయ మైలేజ్ పెంచుకునేందుకే నల్గొండలో సభ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ హయాంలోనే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేసి మళ్ళీ మా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద జల్లడానికి నల్గొండకు వస్తున్నారని, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఆయన నల్గొండకు వస్తారో చూస్తామని, వస్తే తప్పకుండా నిరసనలు తెలియజేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. 



Related Post