బిఆర్ఎస్‌లో మరో రెండు వికెట్లు?

February 11, 2024


img

బిఆర్ఎస్‌ పార్టీలో త్వరలో మరో రెండు వికెట్లు పడబోతున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ డెప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఆమె భర్త మోతె శోభన్ రెడ్డి ఇద్దరూ త్వరలో పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మాజీ డెప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనుక మిగిలిన వారు కూడా చేజారిపోకుండా కాపాడుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో నగరంలోని బిఆర్ఎస్‌ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ఈ సమావేశానికి మోతె శ్రీలత, మోతె శోభన్ రెడ్డి ఇద్దరూ హాజరు కాలేదు. కనుక వారిద్దరూ పార్టీ వీడటం ఖాయమే అని భావించవచ్చు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా ఒకరిద్దరూ బయటకు పోతూనే ఉంటారని, కొత్తవారు వస్తూనే ఉంటారని కనుక బిఆర్ఎస్‌ పార్టీలో నుంచి కూడా ఒకరిద్దరూ బయటకు వెళ్ళిపోతే పార్టీకి ఎటువంటి నష్టమూ లేదని కేటీఆర్‌ అన్నారు. 

కేటీఆర్‌ వాదన నిజమే కావచ్చు. కానీ శాసనసభ ఎన్నికలలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించకపోవడంతో, కనీసం లోక్‌సభ ఎన్నికలలోగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పట్టు సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఆ ప్రయత్నాలలో భాగంగానే బిఆర్ఎస్‌ నేతలకు వల వేస్తోంది. తద్వారా నగరంలో బిఆర్ఎస్‌ పార్టీని ఈవిదంగా బలహీనపరిచి కాంగ్రెస్ బలపడగలిగితే, లోక్‌సభ ఎన్నికలలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నా ప్రమాదం లేదని కేటీఆర్‌ భావిస్తే నష్టపోయేది బిఆర్ఎస్‌ పార్టీయే కదా?


Related Post