బడా బాబులకు రైతు బంధు బంద్... మంచి నిర్ణయమే!

February 11, 2024


img

రైతు బంధు ప్రధాన ఉద్దేశ్యం నిరుపేద రైతులకు పంటలు వేసే ముందు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా కాపాడేందుకే! 

అయితే ఎంతో గొప్ప ఉద్దేశ్యంతో  ప్రవేశపెట్టిన ఈ పధకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం కోటీశ్వరులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా బాబులకు కూడా వర్తింపజేశారు. 

ఈ పధకం ఎంతో అవసరం ఉన్న కౌలు రైతులకు ఇవ్వకుండా బడా బాబులకు ఇవ్వడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని ప్రతిపక్షాలు ఆరోపించినా కేసీఆర్‌ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పధకంలో ఉన్న ఆ లోపాన్ని సరిదిద్ది కేవలం అర్హులైన, నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే రైతు బంధు పధకం వర్తింపజేయాలని నిశ్చయించింది. 

ఇకపై ఎకరానికి ఏడాదికి రూ.15,000 చొప్పున అందిస్తామని ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అందుకే బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు కేటాయించామని చెప్పారు. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతు బంధు, రైతు భరోసా పధకాలు ఇస్తామని చెప్పారు. 

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసిన స్థలాల యజమానులకు కూడా రైతు బంధు ఇచ్చేదాని దాని వలన ప్రభుత్వంపై ఆర్ధికభారం చాలా పడుతోందని భట్టి విక్రమార్క అన్నారు.

పదేళ్ళు ఆలస్యమైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పవచ్చు. ఇంతకాలం బడా బాబులకు ఇస్తున్న సొమ్ముతో ఇప్పుడు నిజమైన రైతులకు, దీని అవసరం చాలా ఉన్న కౌలు రైతులకు ఇస్తే వారికి ఎంతో మేలు కలుగుతుంది. రైతు బంధు పధకం పేరుతో జరిగిన పంపకాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తే దిగ్బ్రంతి కలిగించే విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. 


Related Post