తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే చర్చలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలు మమ్మల్ని అధికారంలో, బిఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.
కనుక అధికార పక్షంగా మేము, ప్రతిపక్షంగా బిఆర్ఎస్ సభ్యులు, మిగిలిన పార్టీల సభ్యులు శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కానీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న గవర్నర్ ప్రసంగానికి హాజరు కాలేదు. ఈరోజు సమావేశానికి హాజరుకాలేదు.
అపార రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న, 80వేల పుస్తకాలు చదివిన మేధావి వచ్చి మా ప్రభుత్వం పనితీరు, మా విధానాలు, నిర్ణయాలపై శాసనసభలో చర్చించి, విశ్లేషించి మాకు తగిన సలహాలు సూచనలు ఇస్తారని ఆశించాం. మా ప్రభుత్వ లోటుపాట్లు ఏవైనా ఉంటే మాకు తెలియజేస్తే సవరించుకునేందుకు మేము సిద్దంగా ఉన్నాము.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ శాసనసభ సమావేశాలలో పాల్గొని మా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తారని ఆశించాం. ప్రజలు కూడా ఆయన నుంచి అదే ఆశిస్తున్నారు. కానీ అత్యంత ముఖ్యమైన ఈ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరుకావడం లేదు.
శాసనసభలో ఆయన కుర్చీ ఖాళీగా ఉండటం ఈ సభకు గౌరవం కాదు. కనుక ఇకనైనా ఆయన శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.
బిఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డితో సహా ప్రధాన ప్రతిపక్ష సభ్యులను శాసనసభ నుంచి ఏదో సాకుతో సస్పెండ్ చేస్తూ బయటకు పంపించేసి ఏకపక్షంగా సమావేశాలు నిర్వహించుకునేవారు.
కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేయకుండా అందరినీ సభలోనే కూర్చోపెట్టి, వారి తప్పులను వారు వినేలా చేయడమే పెద్ద శిక్ష అని చెపుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభ సమావేశాలకు రాకపోతే ఇదివరకు ఎవరూ ఎందుకు రాలేదని అడిగేవారే కాదు. కానీ కేసీఆర్‌ని కూడా శాసనసభకు రప్పించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండటం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో తనను చూసేందుకు ఇష్టపడకనే కేసీఆర్ శాసనసభకు రావడం లేదని వాదిస్తున్నారు. బహుశః ఆయన కోసం కూడా రేవంత్ రెడ్డి మసాలా నూరి సిద్దం చేసి వస్తే వడ్డించేందుకు ఎదురుచూస్తున్నట్లున్నారు.